ఏసీబీ వలలో భద్రాచలం ఎఫ్ డీఓ సుజాత

భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం అటవీ విభాగ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఎఫ్‌డీఓ) సుజాత, చర్ల రేంజ్ ఆఫీసర్ కృష్ణయ్యతో కలిసి రూ.3.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. పూసుగుప్ప నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనుల సందర్భంగా కొన్ని చోట్ల అటవీ శాఖకు చెందిన చెట్లు నరికివేయబడినట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఎఫ్‌డీఓ సుజాత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి విడతగా గురువారం రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ కృష్ణయ్యలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సుజాత గతంలో జిల్లా అటవీ అభివృద్ధి సంస్థ అధికారిగా పనిచేసిన సమయంలో కూడా లంచం ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో భద్రాచలం పట్టణంలో ఏసీబీ అధికారులు పలు దాడులు నిర్వహించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ సీఐను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అటవీ శాఖలో అవినీతి పెరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు.

Leave a Reply