2047 నాటికి స్వర్ణాంధ్రే లక్ష్యం..

డేటా ఆధారిత పాలనతో అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు
ఏఐ, సాంకేతికత, ఆర్థిక మేధస్సుతో పాలనలో విప్లవాత్మక మార్పులు..
ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

తిరుపతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం డేటా ఆధారిత పాలన, కృత్రిమ మేధస్సు (ఏఐ), సాంకేతికత, ఖచ్చితమైన ప్రణాళికలే ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర-2047 ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్” రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పరిపాలన, ప్రజా సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై తన దృష్టిని వివరించారు.

1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పరిపాలనను లోతుగా అధ్యయనం చేశానని చంద్రబాబు తెలిపారు. 1991 ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలోనే తొలిసారిగా విజన్-2020 పత్రాన్ని రూపొందించామని గుర్తు చేశారు. అప్పట్లో విమర్శలు ఎదురైనా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేశామని చెప్పారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కూడా విజన్ డాక్యుమెంట్‌పై తనతో చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.

సాంకేతికత పూర్తిగా విస్తరించని రోజుల్లోనే ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చామని, ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చబోతుందని ముందుగానే గుర్తించామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో జరిగిన తొలి భేటీని ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధి విజన్‌ను వివరించిన తర్వాతే ఆయన సహకారానికి ముందుకొచ్చారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటై ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించిందన్నారు.

ఒకప్పుడు సెల్‌ఫోన్ల గురించి మాట్లాడితే విమర్శలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు అదే సాంకేతికత అవసరాన్ని అందరూ అంగీకరిస్తున్నారని అన్నారు. సమాచార సాంకేతిక విప్లవాన్ని భారత్ సమర్థంగా వినియోగించుకుందని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)పై ఒకప్పుడు సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి రంగంపై సమగ్ర విశ్లేషణ, త్రైమాసిక సమీక్షలను ప్రారంభించామని చెప్పారు. డేటా నాణ్యతే మంచి పాలనకు పునాదని, ఖచ్చితమైన సమాచారంతోనే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా గ్రామస్థాయి నుంచి సమాచార సేకరణను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే డేటా లేక్, డేటా వేర్‌హౌస్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, గత, ప్రస్తుత సమాచారాన్ని ఒకే వేదికపై సమీకరిస్తున్నామని చెప్పారు. శాటిలైట్లు, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), సెన్సర్లు, సీసీ కెమెరాలు, అవసరమైతే వేరబుల్ పరికరాల ద్వారా కూడా ప్రత్యక్ష సమాచారాన్ని సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. గాలి నాణ్యత, నీటి పరిస్థితులు, పర్యావరణ మార్పులపై కూడా రియల్‌టైమ్ సమాచారం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రజలకు సేవలను మరింత సులభంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను అమలు చేస్తున్నామని, ప్రస్తుతం సుమారు 1,100 ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు వాయిస్ ద్వారా సమస్యను తెలియజేస్తే దానిని టెక్స్ట్‌గా మార్చి సంబంధిత శాఖకు పంపించే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని వివరించారు. ప్రజల ఫిర్యాదులను శాస్త్రీయంగా విశ్లేషించి సమస్యల మూలాలను గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు.

ప్రతి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలపై పూర్తి సమాచారాన్ని డేటా ఆధారంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో అవసరమైన చోట మరింత సమర్థంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడిందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమంపై కూడా చంద్రబాబు ప్రత్యేకంగా వివరించారు. ప్రజా-ప్రైవేటు భాగస్వామ్యం (పీ3)తో పాటు సమాజంలో ధనిక-పేదల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు సామర్థ్యం ఉన్న కుటుంబాలు వెనుకబడిన కుటుంబాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే లక్ష మంది మార్గదర్శకులు సుమారు 12 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారని చెప్పారు. దీనిని “మార్గదర్శి–బంగారు కుటుంబం” కార్యక్రమంగా అమలు చేస్తున్నామని వివరించారు.

సంపద ఎవరికీ సహజంగా రాదని, దానిని ప్రణాళికాబద్ధంగా సృష్టించాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అభివృద్ధి ఫలితాలు ప్రతి కుటుంబానికి చేరినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని, సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఉపాధి, మౌలిక వసతులు, పర్యావరణం వంటి అన్ని రంగాల్లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించామని తెలిపారు. ప్రతి మండలం, ప్రతి గ్రామపంచాయతీ, అవసరమైతే ప్రతి కుటుంబ స్థాయిలో కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

లాజిస్టిక్స్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామీణ రహదారుల నుంచి జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాల వరకు సమగ్ర అనుసంధానం కల్పిస్తామని వెల్లడించారు. హబ్ అండ్ స్పోక్ నమూనాలో ప్రతి గంట ప్రయాణ దూరంలో ఒక విమానాశ్రయం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నామని, దేశం నిర్దేశించుకున్న 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజా రవాణాను ఆధునికీకరిస్తూ భవిష్యత్తులో ఎక్కువశాతం ప్రభుత్వ బస్సులను ఎయిర్ కండీషన్డ్ బస్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రజా సంతృప్తినే పాలనకు అసలైన కొలమానంగా తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఉన్న 65 శాతం ప్రజా సంతృప్తిని ముందుగా 80 శాతానికి, అనంతరం 90 శాతానికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం సాంకేతిక ఆడిట్లు, ఐవీఆర్‌ఎస్, క్యూ ఆర్ కోడ్ ఫీడ్‌బ్యాక్ వంటి వ్యవస్థలను వినియోగిస్తున్నామని చెప్పారు.

జనాభా నిర్వహణపై కూడా ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, దక్షిణ భారత రాష్ట్రాల్లో జననాల రేటు తగ్గుతోందని, భవిష్యత్తులో వృద్ధ జనాభా సమస్య తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. సంయుక్త కుటుంబ వ్యవస్థ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సదస్సులో పాల్గొన్న విద్యావేత్తలు గ్రామస్థాయి నుంచి కుటుంబ స్థాయి వరకు డేటా సేకరణలో విశ్వవిద్యాలయాల విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించగా, విద్యను మరింత ప్రాయోగిక దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. డేటా గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే అత్యంత సురక్షితమైన డేటా నిల్వ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

క్వాంటం కంప్యూటింగ్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ తయారీ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని ప్రభుత్వం కృషి చేస్తోందని, అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.