కోట్లు కొట్టేశాడు.. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు.. చివరకు..

కోట్లు కొట్టేశాడు.. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు.. చివరకు..
అకౌంటెంట్ మాయాజాలం.. దారి మళ్లిన రూ.7.9 కోట్లు
కొత్తూరు, ఆంధ్రప్రభ : కంపెనీలో నమ్మకంగా పనిచేయసాగాడు, అదే నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకుని కంపెనీ యాజమాన్యాన్ని నట్టేట ముంచేశాడు. వివరాల్లోకెలితే.. కొత్తూరు మండల పరిధిలోని తీగాపూర్ గ్రామ శివారులో గల ఆర్ఎం కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో హనుమాండ్ల లక్ష్మణ్ ఫైనాన్సియల్ అకౌంట్ హెడ్ గా విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే యాజమాన్యంతో నమ్మకంగా పనిచేయసాగాడు. ఇంకేముంది అదే నమ్మకాన్ని ఆయుధంగా మలుచుకుని కంపెనీ డబ్బులను వెండర్ పేరిట తాను కొత్తగా బ్యాంక్ అకౌంట్ లను ఓపెన్ చేశాడు. అనుకున్నదే తడవుగా వెండర్ కు చెల్లించాల్సిన డబ్బులను హుందాగా తన కొత్త ఖాతాకు దారి మళ్ళించసాగాడు.
ఇలా ఆరు నెలలుగా రూ.7కోట్ల 90లక్షల 27వేల 915 రూపాయలను దర్జాగా కొట్టేశాడు. ఇంకేముంది తన డబ్బులుగా భావించి ఆ డబ్బులను షేర్లలో పెట్టుబడి పెట్టాడు. తన దురదృష్టవశాత్తు షేర్లలో నష్టం వాటిల్లింది. అనుమానం వచ్చి అకౌంట్లలో తేడా కనిపించడంతో పరిశ్రమ డైరెక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇమిడియట్ గా అకౌంటెంట్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం రూ.7కోట్ల 90లక్షల 27వేల 915లను దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో నిందితుడి ఖాతాలో ఉన్న 1కోటి 47లక్షలను ఫ్రీజ్ చేశారు. 2లక్షల 6800 రూపాయల నగదును, ఒక లాప్టాప్, నాలుగు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ శిరీష వెల్లడించారు.
హనుమాండ్ల లక్ష్మణ్ కు ఇదేం కొత్తకాదు, నమ్మకంగా పనిచేయటం నమ్మిన వారిని నట్టేట ముంచటం హనుమాండ్ల లక్ష్మణ్ కు ఇదేం కొత్తకాదు. ఇదే తరహాలో జూబ్లీహిల్స్, చందానగర్ లో సైతం నిధుల దుర్వినియోగానికి, మోసాలకు పాల్పడటంతో రెండు క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయని డీసీపీ శిరీష వెల్లడించారు. ఏనాటికైనా శిక్ష తప్పదు -ఫ్యూచర్ సిటీ షాద్ నగర్ డీసీపీ శిరీష ఎవరైనా, ఎంతటి వారైనా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడితే ఏనాటికైనా పోలీసులచేత శిక్ష తప్పదని నేరస్థులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఫ్యూచర్ సిటీ షాద్ నగర్ డీసీపీ శిరీష. కేసును ఛేదించిన కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య, వారి టీం సభ్యులను డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ అభినందించారు.
