శివాలయ నిర్వహణను పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలి

శివాలయ నిర్వహణను పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలి
- వార్డు సభ్యుడు యాసరాని దినేష్
మునుగోడు, ఆంధ్రప్రభ:
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని స్థానిక శివాలయ నిర్వహణను తక్షణమే గ్రామపంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతూ 6వ వార్డు సభ్యుడు యాసరాని దినేష్ గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శివాలయంలో నిత్య పూజలు, దీపారాధనలు సక్రమంగా నిర్వహించడం లేదని దినేష్ ఆరోపించారు. అక్కడ ఉన్న పూజారుల వ్యవహార శైలి భక్తుల మనోభావాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. ఆలయ హుండీ ద్వారా వచ్చే ఆదాయం, ఇతర నిధులు, వాటి ఖర్చుల విషయంలో ఎలాంటి పారదర్శకత లేదని, ఇప్పటివరకు ఆ లెక్కలను ప్రజలకు వెల్లడించకపోవడం వెనుక బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని మండిపడ్డారు.
ఆలయంలో నిత్య పూజలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఆదాయ-వ్యయాలకు సంబంధించిన పూర్తి వివరాలను, లెక్కలను బహిరంగపర్చి ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆలయ అభివృద్ధి పనులలో భక్తుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భక్తులకు అనుకూలమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు, ఆలయ కమిటీ సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా శివాలయ నిర్వహణ బాధ్యతలను గ్రామపంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా దినేష్ విజ్ఞప్తి చేశారు.
