రైతుల ధాన్యం డబ్బులు నేతల ఖాతాల్లోకి…
- రూ. 12 లక్షల స్వాహాకు పన్నాగం
- ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో అయోమయం
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన డబ్బులు వస్తే వివిధ రకాల ఖర్చుల తీరుతాయని భావించిన రైతులకు గుండె గుబులుమనే వార్త తెలిసింది.. నెల రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో మరింత ఆందోళన చెందారు.
చివరకు తమ డబ్బులు కాంగ్రెస్ నేతల ఖాతాల్లో పడ్డాయని తెలవడం తో అగ్రహం వ్యక్తం చేస్తూ ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్ ను నిలదీశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ పరిధిలోని పెద్దరావులపల్లి లో భారీ మోసానికి తెరదీశారు.. సుమారు 500 మంది రైతుల నుంచి లక్ష బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు.
పెద్దరావులపల్లిలో ఓ ఇద్దరు కాంగ్రెస్ నేతలు బడా మోసానికి ప్రణాళిక రూపొందించారు. సాధారణంగా రైతులు కాంటా వేశాక ట్రక్ షీట్ ఎంట్రీ చేస్తే మిల్లుకు వెళ్తుంది. మిల్లులోనే యాక్సెప్ట్ చేశాక.. డీఎం కార్యాలంలో అప్రూవల్ కొడతారు. అప్పుడు ధాన్యం డబ్బులు ఖాతాల్లో పడుతాయి.. అయితే ఇక్కడ ధాన్యం మాత్రమే రైతులది కాగా, మిగతా ప్రాసెస్ మొత్తం ఇద్దరు కాంగ్రెస్ నేతలది కావడం విశేషం..
14వందల బస్తాల ధాన్యం స్వాహా..?
పెద్దరావులపల్లిలో సుమారు 25మంది రైతులకు చెందిన దాదాపు 14వందల బస్తాల ధాన్యం స్వాహా చేసినట్లు తెలుస్తున్నది. దీని విలువ రూ. 12 లక్షల వరకు ఉందని అంచనా. ఇద్దరు కాంగ్రెస్ నేతలు ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్ పై ఒత్తిడి తెచ్చి.. తొలుత 278 బస్తాల ధాన్యం ఎంట్రీ చేశారు. ఆ తర్వాత ఓ 100 బస్తాలు మరోసారి 960 బస్తాలు ఎంట్రీ చేశారు.
వీటికి సంబంధించి ఆ గ్రామానికి చెందిన ఇద్దరు నేతల ఖాతాల్లో డబ్బులు కూడా జమ అయ్యాయి. ఒక ఖాతాలో 11.72 లక్షలు, మరో ఖాతాలో 95వేలు జమ అయ్యాయి. ఇదంతా రైతులకు తెలియకుండా జరిగినట్లు తెలుస్తున్నది. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే రైతుల భూముల వివాదంలో ఉన్నాయని, అధికంగా పంట సాగు అయ్యిందని చెబుతూ ధాన్యాన్ని తమపై ఎంట్రీ చేసుకున్నామని బయట చెబుతున్నట్లు గ్రామంలో చెప్పుకొంటున్నారు. రైతులకు ముందే ఎందుకు చెప్పలేదని వాదనలు వినిపిస్తున్నాయి. జరిగిన తతంగాన్ని సదరు కాంగ్రెస్ నేతలు పనిని చక్కదిద్దే పనిలో పడ్డారు. డబ్బులు ఇస్తామంటూ బతిమాలినట్లు తెలిసింది. కొందరికి తాత్కాలికంగా రూ.10 వేలు, రూ. 20వేలు ఆన్లైన్ పేమెంట్లు కూడా చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

