‘అలర్ట్ గా లేకపోతే ఆగమే’ కథనానికి స్పందన

‘అలర్ట్ గా లేకపోతే ఆగమే’ కథనానికి స్పందన

-పిచ్చి మొక్కలను తొలగించిన అధికారులు

టేకుమట్ల, ఆంధ్రప్రభ: టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న రహదారి సమస్యలపై ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమైన ‘అలర్ట్ గా లేకపోతే ఆగమే’ అనే ప్రత్యేక కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధిలోని రాఘవరెడ్డిపేట, వేలంపల్లి, పంగిడిపల్లి, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల ప్రధాన రహదారుల్లో ప్రమాదకరంగా మారిన మూల మలుపుల వద్ద దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లను, పొదలను జేసీబీ సహాయంతో పూర్తిగా తొలగించారు.

రహదారి మలుపుల వద్ద ఏపుగా పెరిగిన ఈ పిచ్చి మొక్కల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని ఆంధ్రప్రభ పత్రిక క్షేత్రస్థాయి పరిశీలనతో వెలుగులోకి తెచ్చింది. పత్రికలో వచ్చిన కథనంపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రతిపాదికన ఆయా ప్రాంతాల్లో నిఘా పెట్టి ముళ్లపొదలను శుభ్రం చేయించారు.

రహదారికి అడ్డంగా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మార్గాన్ని సుగమం చేయడం పట్ల వాహనదారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక ఆంధ్రప్రభ అని స్థానికులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యానికి, తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు వాహనదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply