ధాన్యం కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..

ధాన్యం కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..
చిలుపూర్, ఆంధ్రప్రబ : చిలుపూర్ మండలం రాజవరం గ్రామంలోని ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఏవిధంగా జరుగుతున్నది, ధాన్యం రవాణాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను, కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి అలాట్ అయిన మిల్లు యాజమాన్యం మాత్రం మిల్లులో కాలి లేదని ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని నిర్వాహకులు ఎంఎల్ఎ కు వివరించారు. కొనుగోలు కేంద్రంలో ఇంకా 50శాతం ధాన్యం ఉందని దింతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కు తెలిపారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫోన్ చేసి రాజవరం కొనుగోలు కేంద్రంలోని పరిస్థితిని వివరించారు. రాజవరం కొనుగోలు కేంద్రంతో పాటు చాలా కొనుగోలు కేంద్రాలలో మిల్లుర్లతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే మిల్లుల రి-ట్యాగింగ్ చేయాలని సూచించారు. దింతో వీలైనంత తొందరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కానీ గత వర్షాకాలం పంట గోదాములలో నిల్వ ఉండడం వల్ల స్థలం లేక కొంత ఇబ్బంది ఏర్పడుతుందని దీనిని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మక్కల కొనుగోలులో సమస్యలు తొలిగిపోయాయని 2,3 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయాని హామీ ఇచ్చారు.
రైతులు తొందరపడి ప్రయివేట్ దళారుల వద్ద ధాన్యం అమ్ముకొని నష్టపోకూడదని సూచించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
