పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండ

పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండ

చౌటుప్పల్‌లో 102 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని జయశ్రీ గార్డెన్‌లో సోమవారం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మండల తహసీల్దార్ వీరాబాయ్‌లతో కలిసి ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను (డీడీలను) అందజేశారు.

ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ వ్యాప్తంగా మొత్తం 102 మంది అర్హులైన లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం అందింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ 1 నుండి 19 వార్డుల పరిధిలో మొత్తం 46 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. చౌటుప్పల్ మండలంలోని 24 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 56 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. గ్రామాల వారీగా అత్యధిక లబ్ధిదారులు: కొయ్యలగూడెంలో 9 మంది, దేవలమ్మ నగరంలో 7 గురు, జై కేసారంలో 4గురు, పీపల్ పహాడ్‌లో నలుగురు చొప్పున లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సాయం నిరుపేద తల్లిదండ్రులకు తమ కుమార్తెల వివాహ సమయాల్లో అప్పుల పాలు కాకుండా ఎంతో మేలు చేకూరుస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ విస్తృత స్థాయి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply