యుద్ధప్రాతిపదికన ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలి

యుద్ధప్రాతిపదికన ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలి

సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పురుడు పోసుకున్న ప్రాణహిత ప్రాజెక్టును తక్షణమే యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాణహిత సందర్శనకు వస్తున్నారన్న ప్రచారం కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు.

గత పాలకుల నిర్లక్ష్యం – కుప్పకూలిన మేడిగడ్డ
గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి, 70 కిలోమీటర్ల మేర కాలువలు తీసి, భారీ పైపులు తెప్పించారని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రీ-డిజైన్ పేరుతో మేడిగడ్డ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందని విమర్శించారు. కేసీఆర్ స్వయంకృతాపరాధం, ఇంజనీరింగ్ లోపాల వల్ల రూ. 1.50 లక్షల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నేడు రెండు ముక్కలైందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడ్డాయని ఆరోపించారు.

ఉమ్మడి జిల్లాలపై వివక్ష వద్దు
మేడిగడ్డపై పెట్టిన ఖర్చులో సగం ఖర్చు చేసినా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై, ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పట్ల గత ప్రభుత్వం వివక్ష చూపిందని మండిపడ్డారు. దీనివల్ల జగన్నాథ్‌పూర్, అడా ప్రాజెక్టు కాలువల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయాయని, రైతుల డిమాండ్లను నాటి ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు.

ముఖ్యమంత్రికి డిమాండ్లు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ కింది అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు, ముఖ్యంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించే హామీని నెరవేర్చాలి. గత 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడా ప్రాజెక్టు కాలువలు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలి.

ఈ సమావేశంలో పార్టీ కొమురం భీం జిల్లా కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎ. లాల్ కుమార్, జిల్లా నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, డి. బ్రహ్మానందం, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, పీవైఎల్ నాయకుడు జి. మల్లేష్, ఐఎఫ్‌టీయూ నాయకులు డి. శ్రీనివాస్, ఎస్. భూమయ్య తదితరులు పాల్గొన్నారు.