సింగిల్ విండో చైర్మన్‌కు పదవీ కాంక్ష తప్ప

సింగిల్ విండో చైర్మన్‌కు పదవీ కాంక్ష తప్ప

డైరెక్టర్ల ఆగ్రహం

మోత్కూర్, ఆంధ్రప్రభ: కో ఆపరేటివ్ సొసైటీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సింగిల్ విండో డైరెక్టర్లు సామ పద్మారెడ్డి, పురుగుల మల్లయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు సంబంధం లేకుండా నామినేటెడ్ రూపంలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని చూసిన ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందని వారు గుర్తు చేశారు. కొత్త కమిటీలు ఎన్నికయ్యే వరకు పాత కమిటీలనే కొనసాగించాలని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

సమాచారం లేకుండానే బాధ్యతలా?
సహకార సంఘం అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై తోటి డైరెక్టర్లకు కనీస సమాచారం ఇవ్వకుండానే చైర్మన్ పదవీ బాధ్యతలు ఎలా చేపడతారని వారు ప్రశ్నించారు. పదవులపై ఉన్న ఆకాంక్షతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అధికారులు సైతం ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిక్కుబిక్కుమంటున్న రైతులు
“చైర్మన్‌కు పదవులపై ఉన్న తొందర రైతుల సమస్యలపై లేదు. వరి కోతలు కోసి, కళ్ళాల్లోనూ, మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదు. వర్షాల భయంతో రైతులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎదురుచూస్తుంటే, పాలక వర్గం మాత్రం పదవుల వేటలో ఉంది” అని వారు ఎద్దేవా చేశారు.

అసమర్థ పాలనతో దళారుల పాలు
ప్రభుత్వ అసమర్థత వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, దీంతో విధిలేక రైతులు తమ పంటను అడ్డికి పావుశేరు చొప్పున దళారులకు విక్రయించుకుంటూ నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్న అధికార పార్టీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.