నేల ఆరోగ్యంపై రైతులు దృష్టి సారించాలి

నేల ఆరోగ్యంపై రైతులు దృష్టి సారించాలి

  • ఏఎంసీ చైర్మన్ వెంకటయ్య

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ‘రైతు వారోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని 8 రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, సన్న రకాల సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.

​చౌటుప్పల్ రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని, రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ప్రభుత్వం సన్న రకాలకు రూ. 500 బోనస్ ఇస్తున్నందున, రైతులు నాణ్యమైన ఏ-గ్రేడ్ రకాలను సాగు చేసి మద్దతు ధర పొందాలని సూచించారు.

మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ గ్రామానికి 10 మట్టి నమూనాలను సేకరించి, పరీక్షా ఫలితాలను రైతులకు వివరించారు. భూసార పరీక్షల కోసం గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను, ప్రకృతి వ్యవసాయం కోసం ‘కృషి సఖి’లను ఎంపిక చేశారని, ఎరువుల అక్రమ రవాణా, కృత్రిమ కొరతను అరికట్టడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ‘నిఘా సమితి’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వానాకాలం సీజన్‌లో ప్రభుత్వ బోనస్ పొందేందుకు బిపిటి-5204, ఆర్ ఎన్ ఆర్ -15048, జై శ్రీరామ్ వంటి సన్న రకాలను సాగు చేయాలని సూచించారు. ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు బి-గ్రేడ్ కిందకు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలని తెలిపారు.మండల వ్యవసాయ అధికారి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో కార్యదర్శి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు శంకరయ్య, వెన్నెల, శ్రావ్య, వెంకటేష్, ఉమ మహేశ్వరి, లక్ష్మణ్, సోని, సౌమ్యశ్రీ, మార్కెట్ డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.