కార్మికులకు శుభవార్త

కార్మికులకు శుభవార్త
సంగారెడ్డిలో త్వరలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ప్రారంభం
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): సంగారెడ్డి పట్టణం, పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న పరిశ్రమల కార్మికులకు త్వరలోనే ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి సంగారెడ్డికి ఈఎస్ఐ డిస్పెన్సరీని మంజూరు చేశారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన భవనం కోసం స్థానిక నేతలు గత జిల్లా కలెక్టర్‌ను కోరగా, ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని బైపాస్ రోడ్‌లో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న వినియోగంలో లేని ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌ను కేటాయించారు. భవన మరమ్మతుల కోసం జగ్గారెడ్డి తన స్వంత నిధుల నుంచి రూ.8 లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం భవనంలో మరమ్మతు పనులు కొనసాగుతుండగా, పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా పరిశీలించారు. డిస్పెన్సరీలో 10 పడకలు, సుమారు 20 మంది సిబ్బంది ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అదనంగా ల్యాబ్ సదుపాయాలు, అవసరమైన ఔషధాల నిల్వ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. భవిష్యత్తులో శాశ్వత భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి పట్టణంలోనే ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు కావడం సంతోషకరమని, దీని ద్వారా చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని జగ్గారెడ్డి తెలిపారు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా డిస్పెన్సరీ ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు జార్జ్ మాథ్యూస్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
