భయపెడుతున్న భారీ వర్షాలు…

భయపెడుతున్న భారీ వర్షాలు…

  • వరి వెన్ను విరుస్తున్న వరుణుడు
  • చేతికొచ్చే సమయంలో నీరు గారుతున్న పత్తి
  • సమస్యగా మారిన కూలీల కొరత

ఉమ్మడి కరీంనగర్‌ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పడం లేదు. సీజన్‌ ప్రారంభంలో కాస్త ఆలస్యంగా వచ్చిన వానలు.. ఆ తర్వాత ఊపందుకోవడంతో సాగు పనులు ముమ్మరంగా జరిగాయి. పంటలు కూడా ఏపుగా పెరిగాయి.

దాంతో ఈ సారి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని భావించిన రైతులకు ప్రస్తుతం పడుతున్న వానలు వారి గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. ఓ వైపు పత్తి.. మరోవైపు వరి చేతికొచ్చే దశలో ఉండటంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కండిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తీత దశలో ఉన్న పత్తి నీరుగారిపోతుండటం, రంగు మారు తుండటంతో నాణ్యత లోపిస్తోందని ఆవేదన చెందుతున్నారు. పొట్ట, వెన్ను వేసే దశలో ఉన్న వరి నేలవారుతుండటంతో అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు.ఈ ఏడాది కూడా ప్రకృతి రైతులపై కన్నెర్ర చేస్తోంది.

వరుణుడి రూపంలో వారి ఆశలకు గండి కొడుతోంది. పంటలు చేతికందే దశలో వస్తున్న వరుస వానలు వారిని నట్టేట ముంచుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు మండలాల్లో అత్యధికంగా పత్తి పంటను సాగు చేశారు. అన్ని ఖర్చులు కలిపి పెట్టుబడిగా ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టారు.

పంట ఏపుగా పెరగడంతో ఈ సారి పంట కలిసి వస్తుందని రైతు లు ఎంతగానో సంతో షించారు. ప్రస్తుతం కాయలు పగిలి దూది తీసే దశలో ఉండగా.. వరుసగా కురుస్తున్న వానలతో పత్తి గుబ్బల్లో నీరు చేరి రంగు మారుతుంది. ఈ క్రమం లో వానల భయానికి పత్తినంతా ఒకేసారి తీసేందుకు రైతులు ఆరాట పడుతుండగా, వారికి కూలీల కొరత పెద్ద సమ స్మగా మారింది.

స్థానికంగా కూలీలు దొరకకపోతుం డటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి రైతులు కూలీలను తీసుకొస్తున్నారు. కిలో పత్తి తీసినం దుకు రూ.16 ఇవ్వడంతో పాటు రోజూ రవాణా ఖర్చులు రూ. 2వేల చొప్పున అవుతుంది. అయితే ఈ సారి భారీ వర్షాల కారణంగా పత్తి దిగుబడి తగ్గిందని, ఎకరానికి 2క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానల వల్ల పత్తి రంగు మారుతుండటంతో పంట ఇంటికి తీసుకొ చ్చేందు కు రైతులు అవస్థలు పడుతున్నారు.

వరి రైతులు బిక్కుబిక్కు..

ఉమ్మడి జిల్లాలో ఆయకట్టుతో పాటు నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో అధికంగా వరి సాగయ్యింది. ప్రస్తుతం కొన్నిచోట్ల ఆ పంట గింజ పాలు పోసుకొని దశలో ఉండగా.. ముందుగా వరి వేసిన చోట్ల మరో వారం, పది రోజుల్లో కోతకు కూడా వచ్చే అవకాశం ఉంది.

కానీ ఇప్పుడు పడుతున్న వానలు వరిరైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏపుగా ఎదిగి కోతకు వచ్చిన వరిపైరు నేల వాలు తుండటంతో అన్నదాతలు బిక్కు బిక్కుమంటున్నారు. అయితే ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో చాలా గ్రామాల్లో కోతకు వచ్చిన వరి పైరు వర్షాలకు నేలవాలింది.

దాంతో కోత యంత్రాలు తిరగడం ఇబ్బందిగా ఉంటుం దని, ఫలితంగా సమయం ఎక్కువ పట్టి.. వాటి కిరాయి ఎక్కువవుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపిలేని వానలు, వాతావరణ పరిస్థితులతో ఎండుతెగులు, కాటుకతెగులతో వేలాది ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లుతోందని రైతు లు గగ్గోలు పెడుతున్నారు. దాంతో దిగు బడి 50శాతంతగ్గి పెట్టుబడులు భారంగా మారతాయని భయపడుతున్నారు.

నల్ల బారుతున్న పత్తి..

మే చివరి వారంలో ప్రారంభమైన వర్షాలు అక్టోబరు రెండో వారం గడుస్తున్నా వీడటం లేదు. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా జూన్‌, జూలై నెలల్లో పత్తి సాగును రైతాంగం చేపడుతుంది. ఆ సమయంలో కురిసే వర్షాలతో పత్తి ఏపుగా పెరిగి ఆగస్టు వరకు కాత దశకు చేరుకుంటుంది.

సెప్టెంబరు రెండో వారం నుంచి పత్తి సేక రణ సీజన్‌ ప్రారంభమై డిసెంబరు నాటికి పూర్తవుతుంది. రాష్ట్రంలో సాధారణం కంటే రెండు మూడు రెట్ల అధిక వర్ష పాతం నమోదు కావడంతో వచ్చిన గూడ వచ్చినట్లు రాలి పోయింది. దీంతో దిగుబడి తక్కువవుతుందనే అంచనాలు సీజన్‌ మొదటి నుంచీ ఉన్నాయి.

అయితే కాసిన కాయలు కూడా వర్షాల కారణంగా మొక్కపైనే మురిగిపోతున్నాయి. మొదటి దశ లో వచ్చిన కాయలు పగలడంతో వాటిని ఏరేందుకు కూడా వర్షం ఆగడం లేదు. పత్తి పూర్తిగా తడిసిపోయి నల్లగా మారుతోంది. కాయలు మురిగిపోతున్నాయి. తడిసిన పత్తిని తీయడానికి సాధారణం కంటే అధికంగా కూలీలు అవసరం అవుతున్నారు.