Amaravati | సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం

Amaravati | సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం
Amaravati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ఎంపీలు సురేశ్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా సురేశ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తీరుపై బీజేపీ తరచూ విమర్శలు చేస్తోందని అన్నారు. “తల్లిని చంపి బిడ్డను తీశారు” అనే వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రాలు వేరు అయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతికి కేసీఆర్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర సహాయం లేకుండానే పూర్తి చేశామని తెలిపారు.
అదే సమయంలో, తెలంగాణ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంపై సరైన చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని అన్నారు.
దీనికి ప్రతిస్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణులు, కాగ్ నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారంలో ఉన్నవారికి “ఏటీఎం”లా మారిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత తీవ్రరూపం దాల్చింది. కొంతసేపు సభలో గందరగోళం నెలకొనగా, స్పీకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు.
