ప్రజలకు భరోసా కలిగించే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రజలకు భరోసా కలిగించే పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ప్రశాంత వాతావరణం, భరోసానిచ్చే పాలన అందుతోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. నేడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను నేరుగా పరిష్కరించే ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజూ మంత్రుల బృందం నిత్యం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తోందన్నారు. ప్రారంభంలో వేల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంతో క్రమంగా తగ్గాయని వెల్లడించారు.

ప్రజల ఎదుటనే కలెక్టర్లు, జేసీలు, అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపించడం సీఎం చంద్రబాబు పరిపాలనా దృక్పథానికి నిదర్శనం అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి కంటే అరాచకాలకు, కబ్జాలకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. రుషికొండను ధ్వంసం చేసి భారీ ఖర్చుతో నిర్మాణాలు చేపట్టారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.

ఉత్తరాంధ్రలో ఒకప్పుడు గంజాయి మాఫియా విస్తరించి యువత భవిష్యత్తును నాశనం చేసిందని, నేడు కూటమి ప్రభుత్వ చర్యలతో పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి తోటల స్థానంలో కాఫీ తోటలు విస్తరిస్తున్నాయని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని, ఇప్పుడు గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తుకొస్తున్నాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర కీలకమని అన్నారు. విశాఖలో భారీ పెట్టుబడులతో టీసీఎస్ సంస్థ రావడం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు. అనకాపల్లిలో అర్సెలార్ సంస్థ ప్రాజెక్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని పూర్తి చేసి అల్లూరి సీతారామరాజు పేరుతో జాతికి అంకితం చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూడా కూటమి ప్రభుత్వ గొప్ప విజయమన్నారు. రైల్వే జోన్ ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించి తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణలో కూడా కూటమి ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చి ఉక్కు ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గత పాలనలో ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయని అన్నారు.

అమరావతి నిర్మాణంపై విమర్శలు చేసే వారికి రైతుల త్యాగం అర్థం కాదన్నారు. 33 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేశారని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.

Leave a Reply