నిల్వ సామర్థ్యంపై భారీ ప్రణాళిక.. రాష్ట్రానికి కొత్త దిశ

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలకు అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు తెలిపారు.
పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో ఉన్న 1.80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల జీఎంఆర్ గోదాంలను సోమవారం ఆయన సందర్శించారు. గోదాంలలోని నిల్వలను పరిశీలించి నిర్వహణ తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాటి పెద్దపల్లి ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ముందుచూపుతో పెద్దపల్లి ప్రాంతంలో 1.80 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంల నిర్మాణం చేపట్టడం వల్ల ప్రస్తుతం రైతులు, ఆహార నిల్వల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సామర్థ్యం గల గోదాంల నిర్మాణ పనులు పలు ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ నిర్మాణాలను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
దీంతో రానున్న రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి రానుందని వివరించారు.
రాఘవపూర్ గోదాంల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్, నిర్వాహకులను అభినందించారు. అనంతరం గోదాంల నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ రీజనల్ మేనేజర్ సోమయ్య, మేనేజర్ పొన్నం సతీష్ గౌడ్, జీఎంఆర్ గోదాం భాగస్వాములు దండ నరసింహారెడ్డి, కట్కూరి సత్యనారాయణరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
