తెలంగాణ రాష్ట్ర తొలి హెచ్ఆర్సీ చైర్మన్ మృతి..

తెలంగాణ రాష్ట్ర తొలి హెచ్ఆర్సీ చైర్మన్ మృతి..
- హైకోర్టు మాజీ జడ్జి చంద్రయ్య తిమ్మాపూర్ వాసి..
- హైదరాబాదులో అంత్యక్రియలు..
జన్నారం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి హెచ్ఆర్సీ చైర్మన్,రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి గుండ చంద్రయ్య(72) అనారోగ్యంతో హైదరాబాద్ లోని తన సొంత ఇంట్లో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని నిరుపేద హరిజన కుటుంబంలో జన్మించారు.

అతను సొంత గ్రామమైన తిమ్మాపూర్ లో 3వ తరగతి వరకు చదివి,ఆ తర్వాత 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు మండలంలోని తపాల్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు.ఆ తర్వాత హైదరాబాదులో న్యాయ శాస్త్రంలో పట్టా పొంది, హైకోర్టు లాయరుగా ప్రస్తానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తిగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర తొలి హెచ్ఆర్సీ చైర్మనుగా నియామకమై పలు కీలక తీర్పులు ఇచ్చారు.
ఆ తరుణంలో అతను పలువురి మన్ననలు పొందారు.అతని భార్య స్వరూప 2012 లో చనిపోగా,కూతురు లావణ్య,కుమారుడు ప్రశాంత్ లు ఉన్నారు.వీరిద్దరికి వివాహమైంది.కొడుకు అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన తన సొంత గ్రామమైన తిమ్మాపూర్ వాసులతో,చదువుకున్న క్లాస్మేట్లతో ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరిలో నోట్లో నాలుకలాగా మెలిగేవాడని పలువురు తెలిపారు.

జస్టిస్ చంద్రయ్య అంత్యక్రియలు ఆదివారం హైదరాబాదులో చేయనున్నారు.జస్టిస్ మృతితో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం మధ్యాహ్నం చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు దళిత సంఘాల నేతలు నివాళులర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు జాడి గంగాధర్,దాముక కరుణాకర్,జాడి వెంకటయ్య,మల్లేష్ ప్రభుదాస్,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
