హారన్ ఒకటే.. మరి శబ్దంలో ఈ తేడా ఎందుకు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఎప్పుడైనా మీరు ట్రైన్ హారన్ శబ్ధాన్ని సరిగ్గా గమనించారా! రైలు మన వైపు వస్తుంటే హారన్ శబ్దం ఒక్కసారిగా పదునుగా వినిపిస్తుంది. కానీ అదే రైలు మనల్ని దాటి కొన్ని క్షణాల్లో దూరమవుతుంటే ఆ శబ్దం బరువుగా, తక్కువ పిచ్‌లోకి మారిపోతుంది. హారన్ అదే.. శబ్దం కూడా అదే.. మరి మన చెవులకు మాత్రం ఎందుకు తేడాగా వినిపిస్తుంది? రైలు వేగం, శబ్ద తరంగాల మధ్య జరిగే ఈ ఆసక్తికరమైన మార్పు వెనుక ఉన్న శాస్త్రీయ కారణమే డాప్లర్ ప్రభావం. రైలు హారన్‌లో కనిపించే ఈ చిన్న మార్పు వెనుక పెద్ద భౌతికశాస్త్రం దాగి ఉందని తెలుసా.. మరి ఆ విషయమేంటో తెలుసుకుందామా.. !
అసలేంటీ డాప్లర్ ప్రభావం?
రైలు మనవైపు వస్తున్నప్పుడు దాని విజిల్ శబ్దం ఒకలా వినిపిస్తుంది. రైలు మనల్ని దాటి దూరంగా వెళ్తున్నప్పుడు అదే విజిల్ మరోలా, తక్కువగా వినిపిస్తుంది. నిజానికి విజిల్ శబ్దం మారదు.. రైలు కదులుతున్న కారణంగా మనకు శబ్దంలో మార్పు వినిపిస్తుంది. ఈ ప్రభావాన్నే డాప్లర్ ప్రభావం అంటారు. ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ డాప్లర్ పేరు మీద దీనికి ఈ పేరు వచ్చింది.
రైలు మనవైపు వేగంగా వస్తున్నప్పుడు హారన్ నుంచి వెలువడే శబ్ద తరంగాలు ఒకదానికొకటి దగ్గరగా ఒకదానికొకటి దగ్గరవుతాయి. దీంతో శబ్ద తరంగాల పదనుదనం పెరుగుతుంది. ఫలితంగా రైలు హారన్ మనకు ఎక్కువ పిచ్, అంటే మరింత పదునైన శబ్దంలా వినిపిస్తుంది. అదే రైలు మనల్ని దాటి ముందుకు వెళ్లిన తర్వాత పరిస్థితి మారుతుంది. రైలు మన నుంచి దూరంగా వెళ్తున్న కొద్దీ శబ్ద తరంగాలు ఒకదానికొకటి దూరంగా వెలుతాయి. దీంతో పదనుదనం తగ్గుతుంది. అందుకే హారన్ శబ్దం తక్కువ పిచ్‌లో, కాస్త బరువుగా వినిపిస్తుంది.
రైలు వేగమే దీనికి కీలకం..
ఇక్కడ రైలు హారన్ శబ్దం మారడం కాదు. రైలు కదలిక కారణంగా శబ్ద తరంగాలు మన చెవులకు చేరే విధానంలో మార్పు వస్తుంది. రైలు మనవైపు వస్తున్నప్పుడు తరంగాలు కుదించబడటం వల్ల పిచ్ ఎక్కువగా అనిపిస్తుంది. రైలు దూరంగా వెళ్తున్నప్పుడు తరంగాలు విస్తరించడం వల్ల పిచ్ తగ్గుతుంది. డాప్లర్ ప్రభావాన్ని రైలు హారన్లోనే కాదు. మన రోజువారీ జీవితంలోనూ గమనించవచ్చు. వేగంగా వస్తున్న అంబులెన్స్ లేదా పోలీసు వాహనం సైరన్ మన దగ్గరకు చేరే సమయంలో ఒక విధంగా, దాటి వెళ్లిన తర్వాత మరో విధంగా వినిపించడానికి కూడా ఇదే కారణం.
అందుకే మళ్లీ ఈ సారి ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో రైలు హారన్ వినిపించినప్పుడు కాస్త జాగ్రత్తగా గమనించండి. రైలు దగ్గరకు వస్తున్నప్పుడు వినిపించే పిచ్, దాటి వెళ్లిన తర్వాత వినిపించే పిచ్‌లో స్పష్టమైన తేడాను గుర్తించవచ్చు. మన చుట్టూ జరిగే సాధారణ సంఘటనల వెనుక కూడా భౌతికశాస్త్రంలోని ఆసక్తికరమైన సూత్రాలు దాగి ఉన్నాయని చెప్పడానికి డాప్లర్ ప్రభావం మంచి ఉదాహరణ.
