రెండు వారాల్లో ‘రైతుబీమా’ చెల్లించాలి
- తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
- అధికారుల పొరపాటుపై న్యాయస్థానం ఆగ్రహం
- గోగులోనిబావి బాధిత రైతు కుటుంబానికి దక్కిన న్యాయం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన రైతు బీమా క్లెయిమ్ మొత్తాన్ని రెండు వారాల్లోగా బాధిత కుటుంబానికి చెల్లించాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ డివిజన్, సంస్థాన్ నారాయణపురం మండలం, కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోగులోనిబావి గ్రామానికి చెందిన మరణించిన రైతు కళ్లెం జంగారెడ్డి భార్య కళ్లెం మంజుల దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వు ప్రతి అందిన తేదీ నుండి రెండు (2) వారాల వ్యవధిలోగా బీమా సొమ్మును పిటిషనర్‌కు అందజేయాలని ఆదేశిస్తూ రిట్ పిటిషన్‌ను ముగించింది.
శాఖాపరమైన తప్పిదమే..
మరణించిన రైతు కల్లెం జంగారెడ్డి రైతు బీమా పథకంలో చట్టబద్ధంగా నమోదై ఉన్నప్పటికీ, ఆధార్–పట్టాదార్ పాస్‌బుక్ మ్యాపింగ్‌లో అధికారులు చేసిన పొరపాటు కారణంగా బీమా పోర్టల్‌లో ఆయనను తప్పుగా అనర్హుడిగా చూపించారు. దీంతో ఆయన మరణానంతరం కుటుంబానికి అందాల్సిన బీమా క్లెయిమ్ నిలిచిపోయింది. అయితే, ఈ లోపం పూర్తిగా శాఖాపరమైన తప్పిదమేనని జిల్లా వ్యవసాయ అధికారి కూడా లిఖితపూర్వకంగా అంగీకరించారు.
అయినప్పటికీ క్లెయిమ్ చెల్లింపులో దీర్ఘకాలంగా జాప్యం జరుగుతుండటంతో, విసిగిపోయిన బాధిత కుటుంబ సభ్యురాలు మంజుల న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది గుమ్మి రాజ్‌కుమార్ రెడ్డి హాజరై బలమైన వాదనలు వినిపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక పేద రైతు కుటుంబం ఇన్సూరెన్స్ ఫలాలకు దూరమైందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు ఆలకించిన న్యాయస్థానం పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ.. తక్షణమే బీమా సొమ్ము విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
