మహా శివయోగం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు

చిట్యాల, ఆంధ్రప్రభ : మహా శివయోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది.

మండలంలోని పలు శివాలయాల్లో పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ మహాదేవ స్వామి ఆలయంలో ఆలయ పురోహితుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయ కమిటీ చైర్మన్ రంగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పురపాలక చైర్‌పర్సన్ పందిరి గీత–రమేష్ దంపతులు పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.

ఈ సందర్భంగా పందిరి గీత–రమేష్ దంపతులు మాట్లాడుతూ, శివపార్వతుల అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రంగ వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టు సకినాల సుధాకర్, వనమా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి దంపతులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.