woman-death | మౌనిక మృతి మిస్టరీ..
ఆమె మరణంపై పలు అనుమానాలు..
హత్య చేశారా? వేధింపులకు ఆత్మహత్య చేసుకుందా?
అన్నింటికీ ఆధారం ఆ ఎఫ్ఎస్ఎల్ నివేదికనే..
ఆమె ఉంటే అడ్డు వస్తుందని భర్త అత్తమామలు హతమార్చారా?
పిల్లలు పుట్టారనే కారణమా?

woman-death | జన్నారం, ఆంధ్రప్రభ : ఆ యువతిది హత్యనా? బలవన్మమరణమా?.. ఆమె మరణంపై పలు అనుమానాలు. అన్నింటికీ ఆధారం నేర పరిశోధనలో సేకరించిన ఆధారాల శాస్త్రీయంగా విశ్లేషించి ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికార్లు ఇచ్చే నివేదికనేనా అంటే అవునని మేధావులు అంటున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన పంజాల మౌనిక(29) ఆదివారం సాయంత్రం ఇంట్లో మృతి చెందింది. ఆమె మృతిపై తల్లిదండ్రుల కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ భర్త,అత్తమామలు గుట్టుచప్పుడు కాకుండా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.
పిల్లలు పుట్టరనే కారణంతో మౌనికను గత 12 ఏళ్లుగా మానసికంగా, శారీరకంగా భర్త రవిగౌడ్, అత్తమామలు రాజవ్వ, రాజగౌడ్ లు చిత్రహింసలు పెట్టి చంపినట్లు మండలంలోని కవ్వాల చెందిన మృతురాలు తల్లి పరకాల లక్ష్మి ఆదివారం రాత్రి 11 గంటలకు జన్నారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, లక్షేటిపేట సీఐ రమణమూర్తి ఆదేశాల మేరకు జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎఫ్ఎస్ఎల్ అధికార్ల నివేదికే కీలకం..
ఫోరెన్సిక్ సెన్స్ లేబరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికార్లు మౌనిక మరణం పై ఇచ్చే నివేదికే కీలకం. పంజాల మౌనిక మృతదేహానికి ఆదివారం ఉదయం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం శవాన్ని తల్లి పరకాల లక్ష్మీ బంధువులకు పోలీసులు అప్పగించారు. మృతదేహం వద్ద కన్నీరు మున్నేరుగా కుటుంబ సభ్యులు విలపించారు. ఆ ఆసుపత్రి వైద్యుడు మౌనికదేహంలోని కీలక అవయవాల భాగాలను సేకరించి నిబంధన మేరకు భద్రపరిచి శాస్త్రీయంగా విశ్లేషించి పరిశోధన కోసం ఎఫ్ఎస్ఎల్ అధికారులకు పంపారు. ఆ నివేదిక పక్షం రోజుల్లో రానున్నట్లు సమాచారం.
మౌనిక తల్లిదండ్రుల నేపథ్యం..
మండలంలోని కవ్వాలకు చెందిన ప్రముఖ గౌడ సంఘం రాజకీయ నేత పరకాల రాజగౌడ్ రెండో భార్య కుమార్తె మౌనిక. రాజగౌడ్ గత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయారు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్య గౌరవ్వకు ముగ్గురు కుమారులు, ఒక్క కూతురు,చిన్న భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె మౌనిక.మౌనికను ఆ కుటుంబీకులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు.
వివాహ నేపథ్యం..
మేన బావనే భర్త..
మౌనిక తండ్రి పరకాల రాజగౌడ్ తోబుట్టువైన చెల్లెలే అత్త పంజాల రాజవ్వ,మేనబావనే భర్త రవి గౌడ్.2012లో మండలంలోని చింతలపల్లికి చెందిన మేనత్త కుమారుడైన పంజాల రవిగౌడ్ తో కట్న కానుకలు ఇచ్చి ఎంతో ఘనంగా పెళ్లి చేశారు. కొన్ని సంవత్సరాలు ఆ భార్యాభర్తల సంసార జీవితం ఎంతో సాఫీగా జరిగినప్పటికీ పిల్లలు పుట్టారనే కారణంతో గత 12 సంవత్సరాలుగా మౌనికను భర్త, అత్తమామలు మానసికంగా శారీరకంగా ఎంతో వేధించారు. దీంతో మౌనికను ఆదివారం సాయంత్రం భర్త, అత్తమామలు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారనే ఆరోపణలు వచ్చాయి.
