Electric Vehicles Telangana | భారీగా పెరుగుతున్న ఈవీల వినియోగం

Electric Vehicles Telangana | భారీగా పెరుగుతున్న ఈవీల వినియోగం

Electric Vehicles Telangana | ఈవీ పాలసీతో రెండు లక్షలకు చేరువలో వాహనాలు
యువత, మధ్యతరగతి ఈవీల వైపు మొగ్గు
పర్యావరణానికి మేలు.. ప్రభుత్వానికి ఆదాయ నష్టం
రోడ్ టాక్స్, వ్యాట్ ఆదాయానికి గండి
ఇంధన ఖర్చు తగ్గడంతో పెరుగుతున్న డిమాండ్

Electric Vehicles Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు) వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీతో రోడ్డుపైకి కొత్త ఈవీలు పెద్ద సంఖ్యలో వస్తుండగా, మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి పడుతోంది. అయినా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ఈవీలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాస్తవానికి వీటివల్ల రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, పెట్రోలు-డీజిల్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం గణనీయంగా తగ్గినట్లు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతి నెలా సగటున పది వేలకు పైగానే కార్లు, బైక్లు, బస్సులు, టాక్సీలు, ఆటోలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఉండడంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. పాలసీ వచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల కొత్త ఈవీలు రోడ్డెక్కాయి. యువతతోపాటు చిరువ్యాపారులు, ధనిక వర్గాలు ఈ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నాయి.

రెండు లక్షలకు చేరువలో ఈవీలు

ఈవీ పాలసీ అమల్లోకి రాకముందు రాష్ట్రంలో 50 వేలలోపే ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేవి. కానీ గత రెండేళ్లలోనే దాదాపు 1.90 లక్షలకు పైగా కొత్త ఈవీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ప్రస్తుతం ప్రతి నెలా సగటున పది వేలకుపైగా ఈవీ కార్లు, బైక్లు, ఆటోలు, టాక్సీలు, బస్సులు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి.

డిమాండ్ భారీగా పెరగడంతో కొత్త ఈవీ కారు లేదా బైక్ బుక్ చేస్తే రెండు నెలల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈవీలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు ఉండడంతో వాహనం ధరలో దాదాపు 25 శాతం వరకు వినియోగదారులకు ఆదా అవుతోంది. అదనంగా పెట్రోలు, డీజిల్ ఖర్చు లేకపోవడం పెద్ద ఆకర్షణగా మారింది.

పెట్రోల్ కారుకు ఒక్క కిలోమీటర్ ప్రయాణానికి సుమారు రూ.7 వరకు ఖర్చవుతుండగా, ఈవీకి మాత్రం దాదాపు రూ.1.50 మాత్రమే ఖర్చవుతోంది. దీంతో మధ్యతరగతి కుటుంబాలు కూడా పెద్దఎత్తున ఈవీల వైపు మొగ్గుచూపుతున్నాయి.

• రెండేళ్లలో రెండులక్షలకు పైగా వాహనాల విక్రయం
• ఆదాయానికి గండిపడినా… కొనసాగిస్తున్న ప్రోత్సాహం
పర్యావరణ హితమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈవీ పాలసీ

పర్యావరణానికి మేలు.. ఖజానాకు నష్టం…

ఈవీల వాడకం పెరగడం వల్ల కాలుష్యం తగ్గడం, ఇంధన వినియోగం తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది.

మూడు సంవత్సరాలుగా సగటున ఏటా రూ.15 వేల కోట్ల మేర వ్యాట్ ఆదాయం వచ్చేది. కానీ ఈవీల వినియోగం పెరగడంతో 2025-26లో ఈ ఆదాయం రూ.12,071 కోట్లకు పడిపోయింది. ఇక రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుల కారణంగా గత రెండేళ్లలో దాదాపు రూ.800 కోట్ల ఆదాయం కోల్పోయినట్లు అంచనా.

మొత్తం మీద వ్యాట్ ఆదాయం తగ్గుదలతో కలిపి ప్రభుత్వానికి రూ.4 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం తగ్గుతున్నా పర్యావరణ పరిరక్షణ, ఇంధన వినియోగ నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వం ఈవీ పాలసీని కొనసాగిస్తోంది.

Leave a Reply