నా రక్తం తీసుకోండి.. రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి

  • ముప్కాల్ పంప్‌హౌస్ వద్ద రక్తదానంతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిరసన
  • శ్రీరాంసాగర్‌కు వెంటనే నీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్

బాల్కొండ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కాళేశ్వరం జలాలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లోని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో నిర్మించిన పంప్‌హౌస్ వద్ద సోమవారం రైతులతో కలిసి రక్తదాన నిరసన చేపట్టారు.

“నా రక్తం తీసుకోండి… రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి” అంటూ స్వయంగా రక్తదానం చేసిన ప్రశాంత్‌రెడ్డి, రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేశారు. వాటిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పంపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వర్షాభావంపై ప్రశ్నించిన విలేకరికి ముఖ్యమంత్రి “రక్తం చల్లితే పంటలు పండుతాయా?” అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. సీఎం సూచించినట్లుగానే తాను, బాల్కొండ రైతులు రక్తం ఇస్తున్నామని, ఇప్పటికైనా రైతుల పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

గోదావరిలో కాళేశ్వరం వద్ద ప్రతిరోజూ సుమారు 10 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లి ద్వారా వరద కాలువలోకి ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని కోరారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్‌హౌస్‌లు రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, వాటి ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపవచ్చని పేర్కొన్నారు.

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతులకు విడుదల చేయడం లేదని ప్రశ్నించిన ఆయన, వెంటనే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ నీటితో కనీసం 15 రోజుల పాటు పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టును తిరిగి నింపే అవకాశం ఉందని వివరించారు.

వరద కాలువ, కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, గోదావరి ప్యాకేజీ-21, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్, గుత్ప–అలీసాగర్ పథకాలకు కూడా తక్షణమే నీరు కేటాయించాలని కోరారు.

ప్రభుత్వం స్పందించకపోతే వరద కాలువ, పెద్దవాగు, కప్పలవాగు, గోదావరి, కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువల వద్ద రైతులతో కలిసి దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల తరఫున ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15న జరగనున్న సమీక్ష సమావేశంలో రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.