గ్రామసభలతో సమస్యల పరిష్కారం..
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ఎంతో దోహదపడతాయని జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని శనివారం జుక్కల్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామాభివృద్ధి, అర్హులకు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు సమర్థవంతంగా జరుగుతాయని తెలిపారు. గ్రామస్తులు ప్రత్యేక గ్రామసభలతో పాటు గ్రామపంచాయతీ నిర్వహించే ప్రతి గ్రామసభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గుల్లబేస్ గల్లీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని తక్షణమే పరిష్కరించాలని కోరారు.
గ్రామసభలో పచ్చదనం, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, ఆరోగ్యం, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సూపర్వైజింగ్ అధికారి, మిషన్ భగీరథ ఏఈ అఫ్నాన్, ఏపీఓ తులసీరాం, విద్యుత్ శాఖ అధికారులు బోడసాయిలు, విజయకుమార్, ఇతర గ్రామస్థాయి అధికారులు, ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
