ఘనంగా సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గం, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగవరం పట్టణంలో ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. నూతనంగా నిర్మించిన శ్రీ హనుమత్ సమేత, శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శనివారం రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, స్థానిక నాయకులు, పట్టణ వాసులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, నూతనంగా ప్రతిష్టించిన శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ, హనుమంతుని విగ్రహాలను దర్శించుకున్నారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో, హోమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. శ్రీరంగవరం పట్టణంలో సీతారామచంద్ర స్వామి ఆలయం నిర్మించడం, విగ్రహ ప్రతిష్టాపన జరగడం ఎంతో శుభపరిణామం. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల పట్టణాల్లో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. నియోజకవర్గ ప్రజలందరిపై ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అప్పమ్మ గారి జగన్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపల్ చైర్ పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్ మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో భక్తులు, పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు.
