ప్రభుత్వ కళాశాలలో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు తోడ్పాటు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత నోట్‌బుక్స్ చిట్యాల ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్ తౌటం నవీన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ… విద్యార్థుల చదువుకు అవసరమైన నోట్‌బుక్స్‌ను ఉచితంగా అందించడం వల్ల పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై పుస్తకాల కొనుగోలు భారం కొంతవరకు తగ్గుతుందని తెలిపారు.

విద్యార్థులు తరగతి గదిలో అధ్యాపకులు బోధించే పాఠాలను క్రమబద్ధంగా నోట్ చేసుకోవడానికి, ముఖ్యమైన అంశాలను నమోదు చేసుకోవడానికి, అలాగే ఇంటి వద్ద పాఠాలను పునశ్చరణ చేసుకోవడానికి నోట్‌బుక్స్ ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి ఉన్నత విద్యను అభ్యసించి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.