శ్రావణ మాసం తొలి బోనాలను విజయవంతం చేయాలి..
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మట్టి కుండల్లోనే బోనాలు సమర్పించాలి కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు సైదులు విజ్ఞప్తి చేశారు. మండల వ్యాప్తంగా శ్రావణ మాసం తొలి బోనాల కార్యక్రమాలను కుమ్మరులు, ప్రజలు సమష్టిగా విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల్లో నిర్వహించే శ్రావణ మాసం బోనాల కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మట్టి కుండల్లోనే బోనాలు సమర్పించాలని కోరారు. మన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అమ్మవారికి నైవేద్యాన్ని కొత్త మట్టి కుండలోనే సమర్పించాలని సూచించారు.
రాతి పాత్రలు, ఇతర ప్రత్యామ్నాయ పాత్రలను ఉపయోగించకుండా మట్టి కుండలను వినియోగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి కుండల వినియోగం మన సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని తెలిపారు.అలాగే శ్రావణ మాసం తొలి బోనాలను ప్రతి గ్రామంలో కుమ్మరులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్నందున, ఆయా గ్రామాల్లోని కుమ్మరి కుటుంబాలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
