Stock Market | ఐటీ, ఆటో షేర్లపై అమ్మకాల ఒత్తిడి
Stock Market | ఐటీ, ఆటో షేర్లపై అమ్మకాల ఒత్తిడి
సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణత
Stock Market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఇవాళ ప్రారంభంలో లాభాల్లో కనిపించినప్పటికీ, అనంతరం అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లలో భారీ విక్రయాలు నమోదవగా, విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ.1,350 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది.
అదేవిధంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.58కు బలహీనపడటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. గత సెషన్లో 76,728 వద్ద ముగిసిన సెన్సెక్స్ మంగళవారం ప్రారంభంలో లాభాలతో మొదలై, తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్‌లో ఒక దశలో 76,329 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ, చివరకు 249 పాయింట్లు తగ్గి 76,478 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ 80 పాయింట్లు క్షీణించి 23,865 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ మాత్రం 230 పాయింట్లు లాభపడింది. ఈరోజు ట్రేడింగ్‌లో కొచ్చిన్ షిప్‌యార్డ్, మారుతీ సుజుకీ, సోలార్ ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. మరోవైపు కేపీఐటీ టెక్నాలజీస్, ఎయిచర్ మోటార్స్, ఎల్టీఎమ్, టాటా ఎలక్సీ, యెస్ బ్యాంక్ షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి.
