Srisailam | మల్లికార్జున స్వామికి పూజలు

Srisailam | మల్లికార్జున స్వామికి పూజలు
- శ్రీశైలంలో భారత్ ఎన్నికల ప్రధాన కమిషనర్ దంపతులు
- స్వాగతం పలికిన వేద పండితులు
Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ దంపతులు ఈ రోజు తెల్లవారుజామున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద వేద పండితులు ఎన్నికల కమిషనర్ దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణ మార్గం ద్వారా ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. మొదటగా ధ్వజస్తంభానికి నమస్కరించి శివ సంకల్పం చేశారు. అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి మహా మంగళహారతి, మంత్రపుష్పం వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం పంచామృతాలతో శత రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లికా పుష్పాలతో మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించి దర్శనం చేసుకున్నారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసుకొని, అర్చకుల చేత స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వృద్ధ మల్లికార్జున స్వామి లఘుభిషేకం, సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ త్రిశూల దర్శనం చేసుకున్నారు. తదుపరి కుమారస్వామిని దర్శించుకున్నారు.

తదుపరి భారత ఎన్నికల కమిషనర్ దంపతులు శ్రీ భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించారు. షోడశోపచార పూజలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. తరువాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాలు, శేష వస్త్రాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి భారత ఎన్నికల కమిషనర్‌కు సమర్పించారు. అనంతరం గోకులంలో గోమాత పూజను సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, ఆలయ ఈఓ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
