నకిలీ గుర్తింపులతో పాస్‌పోర్ట్‌లు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలు, గుర్తింపు వివరాలతో బహుళ భారతీయ పాస్‌పోర్టులు పొందిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలను సమర్పించి పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మోతుకుపల్లి లక్ష్మీకాంత్‌రెడ్డిని ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మార్చి 22న కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా నిందితుడు వేర్వేరు పేర్లు, వివరాలతో పలు పాస్‌పోర్టులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ పాస్‌పోర్టులను అమెరికా వీసా దరఖాస్తుల సమయంలో వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది.

పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు, వాటికి జత చేసిన పత్రాలను రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి సేకరించిన పోలీసులు.. నిందితుడు గతంలో సమర్పించిన రెసిడెన్స్‌ సర్టిఫికేట్‌ నకిలీదిగా గుర్తించారు.

నిందితుడి నుంచి పాస్‌పోర్ట్‌కు సంబంధించిన పత్రాలు, మొబైల్‌ ఫోన్‌, ఐప్యాడ్‌ సహా పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి బయోమెట్రిక్‌ వివరాలు, అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర, డిజిటల్‌ కమ్యూనికేషన్లను పరిశీలిస్తున్నారు.

బహుళ పాస్‌పోర్టులు పొందేందుకు సహకరించిన బ్రోకర్లు, మధ్యవర్తుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచారు.