సంక్రాంతి రేసులోకి సాయి దుర్గా తేజ్.. ‘సంబరాల ఏటిగట్టు’ రిలీజ్ డేట్ ఖరారు

కత్తి చేతబట్టి రౌద్రంగా సాయి దుర్గా తేజ్‌..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండగకు టాలీవుడ్‌లో అప్పుడే సినిమాల సందడి మొదలైంది. స్టార్ హీరోల చిత్రాలు వరుసగా బరిలోకి దిగుతుండగా.. తాజాగా సాయి దుర్గా తేజ్‌ కూడా సంక్రాంతి రేసులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు) చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది.

‘సంబరాల ఏటిగట్టు’ చిత్రాన్ని 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో సంక్రాంతి బరిలో మరో ఆసక్తికరమైన సినిమా చేరింది. ఇప్పటికే పలు స్టార్‌ హీరోల చిత్రాలు ఈ పండగ రేసులో తమ స్థానాలను ఖరారు చేసుకున్న నేపథ్యంలో.. సాయి దుర్గా తేజ్‌ సినిమా కూడా పోటీకి సిద్ధమైంది. రిలీజ్‌ డేట్‌ ప్రకటనతో పాటు చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మంటల మధ్య రక్తపు మరకలతో సాయి దుర్గా తేజ్‌ కనిపించిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంగా దూసుకొస్తున్న ఆయన ఊరమాస్‌ లుక్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సీజన్‌ టాలీవుడ్‌కు అత్యంత కీలకమైన విడుదల సమయం. పెద్ద హీరోల సినిమాలు ఈ పండగను టార్గెట్‌ చేసుకోవడంతో బాక్సాఫీస్‌ వద్ద పోటీ కూడా భారీగానే ఉంటుంది. ఇప్పుడు ‘సంబరాల ఏటిగట్టు’ కూడా జనవరి 12న విడుదలకు సిద్ధం కావడంతో 2027 సంక్రాంతి సినిమా రేసు మరింత ఆసక్తికరంగా మారింది. సాయి దుర్గా తేజ్‌ గత చిత్రాలకు భిన్నమైన ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తుండటం.. విడుదల తేదీని ముందుగానే ప్రకటించడం.. సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సంక్రాంతి బరిలో ఈ చిత్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.