కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

  • విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించిన కె. హరిత

జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచం లొద్ది కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని తరగతి గదులు, వంటగది, పరిసరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార్థినులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, అధికారులు, హాస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని స్పష్టం చేశారు.

ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. హాస్టల్ ప్రాంగణంతో పాటు వంటగది, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్యపై కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై పలు సలహాలు, విలువైన మార్గదర్శకాలను అందించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి సుమలత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.