నకిలీ డీఏపీ దందాలో కీలక మలుపు.. పోల పట్టివేత!
నకిలీ డీఏపీ ఎరువుల దందాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా నకిలీ ఎరువులను రైతులకు అంటగట్టిన కేసులో కీలక వ్యక్తిగా ఉన్న పోల వెంకటేశ్వర్లు అలియాస్ పోల రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టు, రిమాండ్, బెయిల్.. ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్న జగదీశ్ అలియాస్ జగ్గప్ప గుజరాత్‌లోనే తలదాచుకున్నట్లు సమాచారం. రైతుల వద్ద ఉన్న నకిలీ డీఏపీ బస్తాలు, వారికి పరిహారం చెల్లిస్తున్న మధ్యవర్తులు, ఎరువుల వ్యాపారుల పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ పోల పట్టివేత!
జిల్లా వ్యాప్తంగా నకిలీ డీఏపీ ఎరువులను పంపిణీ చేసిన కేసులో కీలక వ్యక్తి పోల వెంకటేశ్వర్లు అలియాస్ పోల రాజును నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా పోల వెంకటేశ్వర్లు కోసం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నల్గొండ పోలీసుల అరెస్టులో రిమాండ్‌లో ఉన్న పోల వెంకటేశ్వర్లు వారం రోజుల్లోనే బెయిల్‌పై బయటకు రావడం విశేషం. అప్పటికే పోల కోసం వివిధ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసుల కళ్లుగప్పి పోల పారిపోయారు.
హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేట్ కేంద్రంగా నకిలీ డీఏపీని తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన ప్రధాన సూత్రధారి కర్ణాటకలోని బీదర్‌కు చెందిన జగదీశ్ అలియాస్ జగ్గప్ప నేటికీ గుజరాత్‌లోనే తలదాచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రభ, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నకిలీ డీఏపీ విక్రయాలు కొనసాగినట్లు తెలుస్తోంది. కొందరు రైతుల సమాచారం, వ్యవసాయ అధికారుల ఫిర్యాదుతో పూడూరు, పరిగి, యాలాల, తాండూరు, బంటారం మండలాల్లో నకిలీ డీఏపీకి సంబంధించి కేసులు నమోదు చేశారు.
చాలా గ్రామాల్లో రైతుల వద్ద పెద్ద మొత్తంలో నకిలీ డీఏపీ బస్తాలు ఉన్నట్లు సమాచారం. నేటికీ రైతుల ఇళ్లలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని విక్రయించిన మధ్యవర్తులు పరిహారం చెల్లించేందుకు అంగీకరించడంతో రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. ఫిర్యాదు చేస్తే ఎలాంటి పరిహారం రాదని భావించిన రైతులు నకిలీ డీఏపీ బస్తాల విషయాన్ని బయటకు చెప్పడం లేదని తెలుస్తోంది.
పూడూరు, పరిగి, యాలాల మండలాల్లో రైతులకు నకిలీ డీఏపీని విక్రయించిన వ్యక్తులు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లింపు పూర్తి చేసినట్లు సమాచారం. ఇలా రైతులకు పరిహారం చెల్లించిన మధ్యవర్తుల్లో ఎరువుల వ్యాపారులు కూడా ఉన్నారు.
నకిలీ వ్యాపారంలో దిట్ట..
జిల్లాలోని పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన పోల వెంకటేశ్వర్లుకు ఎరువుల వ్యాపారంలో అనుభవం ఉండడంతో జిల్లాలోని చాలా ప్రాంతాలకు నకిలీ డీఏపీ బస్తాలను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు కూడా వాటిని పంపిణీ చేశారు.
నల్గొండ జిల్లాలోని మఠంపల్లి పోలీస్ స్టేషన్, రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా పోల వెంకటేశ్వర్లుపై నకిలీ డీఏపీ పంపిణీ కేసులు నమోదు చేశారు. మఠంపల్లి పోలీసులు పోల వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. జిల్లాలోని యాలాల, తాండూరు, బంటారం పోలీస్ స్టేషన్లలో కూడా పోల వెంకటేశ్వర్లుపై కేసులు నమోదయ్యాయి.
గత కొద్ది ఏళ్లుగా పోల వెంకటేశ్వర్లు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లోని ఒక ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నారు. గత ఏడాది దుకాణం యజమాని, పోల వెంకటేశ్వర్లు కలిసి కర్ణాటక నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి విక్రయించారు. ఈ కేసులో ఎరువుల దుకాణం యజమాని పట్టుబడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ డీఏపీ కేసులో వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణం యజమానికి క్లీన్‌చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
బెయిల్‌ను అడ్డుకోని పోలీసులు?
నకిలీ డీఏపీ పంపిణీలో కీలక వ్యక్తి పోల వెంకటేశ్వర్లు అరెస్టుతో జిల్లాలో దీనికి సంబంధించి నమోదైన కేసుల్లో చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావించారు. నల్గొండ పోలీసులు రిమాండ్‌కు తరలించిన పోల వెంకటేశ్వర్లు వారం రోజుల్లోనే బెయిల్‌పై బయటకు రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.
సాధారణంగా ఈ తరహా కేసుల్లో రెండు వారాల తరువాత నిందితులకు బెయిల్ వస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. పోల వెంకటేశ్వర్లు వేసిన బెయిల్ పిటిషన్‌ను మఠంపల్లి పోలీసులు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ఎందుకు వ్యతిరేకించలేదనేది ఆసక్తికరంగా మారింది.
జైలుకు ఇలా వెళ్లి.. అలా బయటకు వచ్చిన పోల వెంకటేశ్వర్లు గంటల వ్యవధిలోనే పోలీసుల కళ్లుగప్పి మాయమయ్యారు. జైలులో ఉన్న పోల వెంకటేశ్వర్లును పీటీ వారెంట్ ద్వారా అరెస్ట్ చేసేందుకు అనేక పోలీస్ స్టేషన్లకు చెందిన దర్యాప్తు అధికారులు ప్రయత్నించారు. పోలీసులకు చిక్కకుండా పోల వెంకటేశ్వర్లు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
దీనిని బట్టి నకిలీ డీఏపీ తయారీ, విక్రయాలు సాగించిన ముఠా నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందనేది స్పష్టమవుతోందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ డీఏపీని పంపిణీ చేసిన కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన జగదీశ్ అలియాస్ జగ్గప్ప నేటికీ గుజరాత్ రాష్ట్రంలోనే తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. జగదీశ్ కదలికలపై రాష్ట్రంలోని అనేక జిల్లాల పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
విషయం తెలుసుకున్న జగదీశ్ గుజరాత్ దాటి బయటకు రావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
