లోక్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’..
- గవర్నర్ ఆతిథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ ఆతిథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకోవడంతో కార్యక్రమం సందడిగా సాగింది.
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాల సందర్భంగా గవర్నర్ తేనీటి విందు ఏర్పాటు చేయడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయంలో భాగంగానే లోక్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా.. పలువురు ప్రముఖులు గవర్నర్‌కు, ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
