ఆర్‌బీకే అద్దెల్లో భారీ కుంభకోణం..
ఆర్‌బీకే అద్దెల్లో భారీ కుంభకోణం..
ఏవో సంతకం ఫోర్జరీతో లక్షల రూపాయల దోపిడీ?
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) భవనాల అద్దె చెల్లింపుల పేరుతో జరిగిన భారీ కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను అడ్డుపెట్టుకుని ఐదేళ్లపాటు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, జూపాడు బంగ్లా మండలంలో గతంలో వ్యవసాయ అధికారిగా పనిచేసిన రంగారెడ్డి ఈ వ్యవహారంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. 2018 నుంచి 2023 వరకు ఆర్‌బీకే భవనాల అద్దె చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని, తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బోగస్ బిల్లులు సృష్టించి లక్షల రూపాయలు డ్రా చేశారని ఆరోపించారు.
ఈ ఫిర్యాదుతో ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం విచారణ ప్రారంభించి, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 18 మందికి నోటీసులు జారీ చేశారు.
గురువారం నందికొట్కూరు ఏడీఏ కార్యాలయంలో విచారణను మరింత వేగవంతం చేశారు. నంద్యాల జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకురాలు సరళమ్మ, వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నోటీసులు అందుకున్న వ్యక్తులను విచారించారు.
ఆర్‌బీకే భవనాలకు వాస్తవంగా ఎన్ని చోట్ల అద్దెలు చెల్లించారు? బిల్లులు ఎవరు తయారు చేశారు? నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి? అనే అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లోనే ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఈ కుంభకోణంలో అసలు బాధ్యులు ఎవరు? నిధుల దుర్వినియోగం ఎంత మేర జరిగింది? సంబంధిత అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే అంశాలు విచారణ పూర్తయ్యాక తేలనున్నాయి.
