చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం..

  • అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి, నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.
బాధితుల సమస్యలను ఓపికగా విన్న అదనపు ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తారని, అటువంటి బాధితులకు పోలీసు శాఖ వెన్నుముకగా నిలిచి భరోసా కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫిర్యాదులు మరల మరల పునరావృతం కాకుండా ఉండాలంటే, మొదటి విడతలోనే లోతైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేకూరేలా చూడాలన్నారు. విచారణలో జాప్యం వహించకుండా, పారదర్శకమైన పద్ధతిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.