రేపు మూడు జిల్లాల్లో సీఎం పర్యటన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరనున్న సీఎం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్‌పల్లికి చేరుకుంటారు. అక్కడ జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి హాజరవుతారు.

అనంతరం ములుగు జిల్లాలోని మేడారం చేరుకుని వనదేవతలు సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. తర్వాత ములుగు పట్టణానికి చేరుకుని గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించనున్నారు.

ములుగు పర్యటన అనంతరం ముఖ్యమంత్రి హనుమకొండ జిల్లా పరకాలకు వెళ్లనున్నారు. అక్కడ వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో మూడు జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. భద్రత, రవాణా, సభా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.