రేవంత్‌వి 420 మాటలు..

  • ప్రజలే బుద్ధి చెబుతారు : హరీశ్‌రావు

సిద్దిపేట, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా అబద్ధాలే మాట్లాడారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రతీ మాట అబద్ధమేనని, ఆయన మాటలకు ప్రజలే సరైన సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు. శనివారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. “ఆనాడు 420 హామీలు.. ఈనాడు 420 మాటలు” అంటూ విమర్శలు గుప్పించారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడటం బాధాకరమని అన్నారు. రేవంత్‌రెడ్డి ఒక్కటి కూడా నిజం చెప్పరని, ఆయన ఒక పచ్చి మోసగాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “దేవుళ్లపై ఒట్టుపెట్టి ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. అసెంబ్లీలో అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుల మీద ప్రేమ ఉందని చెప్పుకోవడం కాదు.. రైతు బిడ్డవైతే ముందుగా రుణమాఫీ చేయాలి” అని హరీశ్‌రావు అన్నారు.

రుణమాఫీపై రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్..

రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి సొంత గ్రామానికి వెళ్లి రైతులను అడగాలని అన్నారు. అక్కడి రైతులు రుణమాఫీ అయ్యిందని చెబితే నేను రాజీనామా చేస్తా.. రుణమాఫీ కాలేదని చెబితే రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రుణమాఫీ, రైతుబంధు అంశాలపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై తాము పోరాటం కొనసాగిస్తామని హ‌రీశ్ రావు స్పష్టం చేశారు.

కేసీఆర్ హయాంలో వరుసగా మూడేళ్లలో రూ.14,656 కోట్లు, రూ.14,721 కోట్లు, రూ.14,721 కోట్లు రైతుబంధుగా ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం 2024-25లో కేవలం రూ.5,057 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2025-26లో రూ.11 వేల కోట్లు ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన దానికంటే రూ.15 వేల కోట్లు తక్కువ ఇచ్చారు అని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే బకాయిలు చెల్లించాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

2 లక్షల ఉద్యోగాల హామీపై ప్రశ్నలు..

నిరుద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని హరీశ్‌రావు విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ సమక్షంలో హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లు గడిచినా 16 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులను మోసం చేసినందుకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి అని అన్నారు. గన్‌మెన్లు లేకుండా అశోక్‌నగర్‌కు వస్తారా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు, కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి. వారి జీవితాలతో ఆటలు ఆడుతున్నారు అని హ‌రీశ్ రావు మండిపడ్డారు.

సింగూరు, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై విమర్శలు

ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్ చేతకానితనం వల్లే సింగూరు ఖాళీ అయింది. కామారెడ్డి జిల్లాకు మంచినీటి సమస్య వచ్చింది. సంగారెడ్డి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు ప్రారంభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మూలన పడేసింది” అని విమర్శించారు. జహీరాబాద్‌లో బసవేశ్వర విగ్రహం ప్రారంభించి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో ఈ మూడేళ్లలో ఒక్క రోడ్డు అయినా వేశారా అని నిలదీశారు.

రేషన్ కార్డుల అంశంపైనా విమర్శలు..

రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చినట్లు అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సంగారెడ్డిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడే రేవంత్‌రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు” అని హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చినట్లు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.

“రేవంత్ అవినీతిపై పోరాటం కొనసాగిస్తాం”

తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. తనపై పదేపదే ఆరోపణలు చేస్తే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అభివృద్ధి, రైతుల సమస్యలపై చర్చకు మేము సిద్ధం. ప్రజల ముందు వాస్తవాలు బయటపడతాయి అని హరీశ్‌రావు అన్నారు.