ODI-WC 2027 | అహింసా సందేశంతో ప్రపంచకప్ !
ఆంధ్రప్రభ : వన్డే ప్రపంచకప్ 2027 ప్రారంభ తేదీపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీని 2027 అక్టోబర్ 2న ప్రారంభించే దిశగా ఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి కావడంతో.. శాంతి, అహింసా సిద్ధాంతాలను ప్రపంచానికి చాటిన గాంధీజీకి నివాళిగా ఈ రోజునే ప్రపంచకప్‌ను ప్రారంభించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టోర్నీ ప్రారంభ తేదీపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీకి దక్షిణాఫ్రికాతో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. న్యాయవాదిగా ఉన్న సమయంలో గాంధీజీ తన జీవితంలో 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో గడిపారు. అక్కడే ఆయన అహింసా ఉద్యమానికి బీజాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో, గాంధీ జయంతి నాడు ప్రపంచ కప్‌ను ప్రారంభించడం ఒక సముచితమైన నివాళిగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విభేదాలు పెరుగుతున్న సమయంలో శాంతి, అహింస సందేశాన్ని అందించేలా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 2కు మార్పు?
మొదట ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 ను అక్టోబర్ 8న ప్రారంభించాలని భావించింది. అక్టోబర్ 1 నుంచి 7 వరకు వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించి.. అనంతరం ప్రధాన టోర్నీని ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే ప్రస్తుతం ఆ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కొత్త ప్రణాళిక ప్రకారం అక్టోబర్ 2నే టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వార్మప్ మ్యాచ్‌లను అంతకుముందే నిర్వహించేలా ఐసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐసీసీ ప్రణాలికల ప్రకారం 2027 ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 21న (ఆదివారం) జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ షెడ్యూల్‌పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
50 రోజుల పాటు క్రికెట్ పండుగ..
కాగా, మొత్తం 14 జట్లతో జరిగే ఈ టోర్నీ దాదాపు 50 రోజుల పాటు కొనసాగనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన 12 వేదికలను ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని వేదికలను వెల్లడించింది. దక్షిణాఫ్రికా నుంచి 8 నగరాలు, జింబాబ్వే నుంచి 3 నగరాలు, నమీబియా రాజధాని విండ్‌హోక్‌ను వేదికలుగా ఎంపిక చేశారు.
దక్షిణాఫ్రికాలో ఎంపికైన వేదికలు
వాండరర్స్ స్టేడియం, జొహన్నెస్‌బర్గ్
సెంచూరియన్, ష్వానే
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్, కేప్‌టౌన్
కింగ్స్‌మీడ్ క్రికెట్ గ్రౌండ్, డర్బన్
సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా
మంగౌంగ్ ఓవల్, బ్లోమ్‌ఫాంటీన్
బోలాండ్ పార్క్, పార్ల్
బఫెలో పార్క్, కుగోంపో సిటీ (గతంలో ఈస్ట్ లండన్)
జింబాబ్వేలో ఎంపికైన వేదికలు
హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో
మోసీ-ఓ-తున్యా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, విక్టోరియా ఫాల్స్
నమీబియాలో ఎంపికైన వేదిక
నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
2027 ప్రపంచకప్ ఫార్మాట్‌లో మార్పులు
2027 ప్రపంచకప్‌లో ఫార్మాట్‌లో కూడా మార్పులు చేశారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్న మూడు జట్లు ముందుగా సూపర్ సిరీస్ పేరుతో చిన్న లీగ్‌లో తలపడనున్నాయి. ఈ సూపర్ సిరీస్ విజేత మిగిలిన 11 జట్లతో కలిసి మొత్తం 12 జట్ల ప్రధాన దశలోకి చేరుతుంది. ఆ తర్వాత జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ దశలో పరస్పరం తలపడిన అనంతరం సూపర్ సెవెన్ దశ, సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి.
ఇప్పటికే అర్హత సాధించిన జట్లు..
2027 ప్రపంచకప్‌కు ఇప్పటికే పది జట్లు అర్హత సాధించాయి.
దక్షిణాఫ్రికా (ఆతిథ్య జట్టు)
జింబాబ్వే (ఆతిథ్య జట్టు)
భారత్
ఆస్ట్రేలియా
న్యూజిలాండ్
పాకిస్థాన్
ఇంగ్లండ్
శ్రీలంక
బంగ్లాదేశ్
అఫ్గానిస్థాన్
మిగిలిన నాలుగు జట్లను వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించే క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇందులో 10 జట్లు పాల్గొననున్నాయి. ఆతిథ్య దేశమైన నమీబియాతో పాటు వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు కూడా ఈ క్వాలిఫయర్‌లో పోటీ పడనున్నాయి.
