క‌న్నీళ్లు పెట్టుకున్న చిట్టి..

  • బోనాలపై ట్రోలింగ్‌..
  • కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

ఆంధ్రప్రభ : ‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా ఫేమ‌స్ అయ్యి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ఫరియా అబ్దుల్లా సోషల్‌ మీడియాలో తనపై వచ్చిన విమర్శలపై భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నందుకు కొందరు నెటిజన్లు చేసిన విమర్శలు, కామెంట్లపై కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు.

తన కుటుంబ నేపథ్యం, మత విశ్వాసాలు, మానవత్వంపై తన అభిప్రాయాలను ఫరియా వీడియోలో వివరించారు. తన తండ్రి కన్వర్టెడ్ ముస్లిం అని.. ఇస్లాం మతంపై విశ్వాసంతో ఆ మతాన్ని స్వీకరించారని, ఇస్లాంలోని మంచి విషయాలను మాత్రమే తనకు నేర్పించారని తెలిపారు.

తన తల్లి చెప్పిన “అల్లా అన్నింటా ఉంటారు” అనే మాటలను గుర్తు చేసుకున్న ఫరియా.. ప్రకృతిలోని ప్రతి అంశంలోనూ జీవాన్ని చూస్తానని చెప్పారు. చెట్టు, రాయి, సీతాకోకచిలుక ఇలా ప్రతి దానిలోనూ ఒక ప్రత్యేకత ఉందని, మనుషుల మధ్య ప్రేమ, ఐక్యత, శాంతి ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు.

తనను ‘కాఫిర్‌’ అంటూ విమర్శించిన వారిపైనా ఆమె స్పందించారు. తనపై ద్వేషం చూపించే వారికి కూడా ప్రేమనే పంచుతానని, వారి మంచిని కోరుకుంటానని చెప్పారు. “అల్లా” అనే పదానికి తనకు ఉన్న అర్థం.. ప్రతి చోటా, ప్రతి సమయంలో అన్నింటినీ కలిపే వెలుగు అని వివరించారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బోనం ఎత్తడంతో పాటు పోతురాజులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో కొందరు ఆమెను విమర్శించారు. దీనిపై స్పందిస్తూ ఆమె తన భావాలను వీడియో ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఫరియా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.