Siro Pharma | బయోటెక్ రంగానికి మరో మైలురాయి

సిద్దిపేటలో అత్యాధునిక క్యాన్సర్ ఔషధ తయారీ కేంద్రం ప్రారంభం..
మార్కూక్ బయోటెక్ పార్క్ ఫేజ్-3లో సిరో ఫార్మా తయారీ కేంద్రం ఓపెనింగ్‌
హాజ‌రైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆంకాలజీ, సాఫ్ట్‌జెల్ ఔషధాల ఉత్పత్తితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

Siro Pharma |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ఔషధ తయారీ రంగానికి మరో కీలక మైలురాయి చేరింది. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలంలోని బయోటెక్ పార్క్ ఫేజ్-3లో సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అత్యాధునిక ఆంకాలజీ (క్యాన్సర్) మరియు సాఫ్ట్‌జెల్ ఔషధ తయారీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా రిబ్బన్ కత్తిరించి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి విభాగాలను పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యున్నత నాణ్యత, భద్రత, నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు.

ఈ కేంద్రంలో దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల కోసం అధిక నాణ్యత గల క్యాన్సర్ ఔషధాలు, సాఫ్ట్‌జెల్ ఫార్ములేషన్లను తయారు చేయనున్నారు. దీంతో భారత ఔషధ తయారీ రంగంలో తెలంగాణకు మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన క్యాన్సర్ ఔషధాల తయారీకి ఊతం లభించడంతో పాటు సిద్దిపేట జిల్లాలో స్థానిక యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. జీవ విజ్ఞాన, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ స్థాయిని ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.