Bandi Bhagirath | బండి భగీరథ్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

హైకోర్టులో ఉత్కంఠ రేపిన విచారణ

Bandi Bhagirath | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

విచారణ సందర్భంగా బాధితురాలి తరపు న్యాయవాది భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్న నేపథ్యంలో కేసు విచారణపై ప్రభావం పడే అవకాశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా పలువురు సాక్షులను విచారించాల్సి ఉందని, నిందితుడు బయటకు వస్తే వారు వాంగ్మూలం ఇవ్వడానికి వెనుకాడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో పలు అంశాలను కోర్టు ముందు ఉంచారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం ఆరోపణల తీవ్రత దృష్ట్యా అభియోగాలను సవరించినట్లు వెల్లడించారు.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, నిందితుడు స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు పూర్తికావడంతో భగీరథ్‌కు బెయిల్ మంజూరవుతుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది.