హిందూ మహాసముద్రంలో భారత్‌కు మరింత బలం..
- భారత నౌకాదళంలోకి మరో బ్రహ్మాస్త్రం..
- భారత నౌకాదళంలోకి ‘మహేంద్రగిరి’..
- సముద్ర రక్షణకు మరో అజేయ కవచం
- జూలై 11న విశాఖలో కమిషనింగ్..
- బ్రహ్మోస్, బరాక్-8తో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ సిద్ధం
ఆంధ్రప్రభ : భారతదేశ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న అత్యాధునిక స్టీల్త్ ఫ్రిగేట్ (శత్రువుల రాడార్లకు చిక్కని యుద్ధనౌక) ‘మహేంద్రగిరి’ (F38) భారత నౌకాదళంలోకి చేరడానికి సిద్ధమైంది. జూలై 11న (శనివారం) విశాఖపట్నంలో జరగనున్న అధికారిక కార్యక్రమంలో ఈ యుద్ధనౌకను రక్షణ రంగ సేవల్లోకి ప్రవేశపెట్టనున్నారు.
తూర్పు కనుమలలోని అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి పేరు మీదుగా నామకరణం చేసిన ఈ నౌక, భారత నౌకాదళానికి సరికొత్త జవసత్వాలను అందిస్తుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
భారత నావికాదళం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ 17A’ సిరీస్‌లో భాగంగా తయారైన ఆరో అత్యాధునిక యుద్ధనౌక ఇది. దీనిని ఇండియన్ నేవీకి చెందిన ‘వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ స్వయంగా రూపకల్పన చేయగా, ముంబైలోని ‘మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్’ (MDL) నిర్మించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ విజన్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ ప్రాజెక్టులో 75 శాతానికి పైగా దేశీయ పరికరాలనే వాడటం విశేషం. ఈ భారీ యుద్ధనౌక నిర్మాణం కోసం దేశీయంగా ఉన్న అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) భాగస్వామ్యం పంచుకోవడం ద్వారా దేశీయ రక్షణ పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసినట్లయింది.
సాంకేతికంగా ఈ యుద్ధనౌక శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యంత అధునాతన ఆయుధాలు, సెన్సార్లతో సన్నద్ధమైంది. సుదూర తీరాల్లోని శత్రు నౌకలను, భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి అత్యంత వేగవంతమైన ‘బ్రహ్మోస్’ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఇందులో అమర్చారు.
అలాగే శత్రువుల విమానాలు, డ్రోన్లు, దూసుకొచ్చే క్షిపణులను గాల్లోనే కూల్చేందుకు ‘బరాక్-8’ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో దాక్కునే శత్రు జలాంతర్గాములను మట్టుబెట్టడానికి అధునాతన టోర్పెడోలు, రాకెట్ లాంచర్లు, ముందస్తు ముప్పులను గుర్తించడానికి శక్తివంతమైన ‘MF-STAR AESA’ రాడార్‌ను ఇందులో అమర్చారు.
అంతేకాకుండా, అత్యవసర సమయాల్లో దీనిపై నుండి హాల్ ధ్రువ్ (HAL Dhruv) లేదా సీ కింగ్ వంటి నావికాదళ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేయవచ్చు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం అత్యంత నమ్మకమైన భద్రతా భాగస్వామిగా ఎదుగుతున్న తరుణంలో, ‘మహేంద్రగిరి’ రాక నౌకాదళ బలాన్ని రెట్టింపు చేయనుంది. శత్రువుల రాడార్ల కళ్ళు గప్పి సరిహద్దుల్లో వ్యూహాత్మక దాడులు చేయగల సామర్థ్యం ఈ స్టీల్త్ ఫ్రిగేట్ సొంతం. “మైటీ–మెజెస్టిక్–మ్యాచ్‌లెస్” (మహా శక్తివంతమైన–గంభీరమైన–సాటిలేనిది) అనే నినాదంతో, దేశ సముద్ర తీర సరిహద్దులను కాపాడటంలో ఈ యుద్ధనౌక అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోంది.
