బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నీటి ధరలు పెరగనున్నాయి. తాగునీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచినట్లు బెంగళూరు నీటి సరఫరా బోర్డు పేర్కొనింది. అయితే, గత దశాబ్ద కాలంగా బెంగళూరు జనాభాతో పాటు భౌగోళిక విస్తరణలో వేగంగా వృద్ధి చెందింది. ఇక, ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా చేయాలంటే సరైన నిధులు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎస్ఎస్ బీ చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ పేర్కొన్నారు.
అయితే, 2014 నుంచి బెంగళూరు నగరంలో నీటి పన్ను పెంచలేదని బీడబ్ల్యూఎస్ఎస్ చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా బోర్డు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం కారణంగా తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గత 10 ఏళ్లలో విద్యుత్ ఖర్చులు 107 శాతం పెరిగాయి.. నిర్వహణ ఖర్చులు 122.5 శాతం పెరిగాయి.. నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డుకు ప్రస్తుతం రూ.120కోట్లు మాత్రమే వస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీని ఫలితంగా నెలకు రూ.80కోట్ల లోటు ఏర్పడిందని వెల్లడించారు. ఆ లోటును భర్తీ చేసేందుకే.. ఇప్పుడు ధరలను పెంచినట్లు రామ్ ప్రసాద్ మనోహర్ చెప్పుకొచ్చారు.
కాగా, కర్ణాటక రాష్ట్ర పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫార్సులను అనుసరించి.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3 శాతం నీటి ఛార్జీల పెంపు ఉండబోతుందని బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు ఛైర్మన్ మనోహర్ తెలిపారు.
పెంచిన నీటి ధరలు ఇలా ఉన్నాయి..
- ఒక లీటరుకు 0.15 పైసలు..
- 8,000 లీటర్ల వరకు అయితే 0.30 పైసలు..
- 25,001 నుంచి 50,000 లీటర్ల వరకు లీటరుకు 0.80 పైసలు..
- 50,001 లీటర్లకు మించితే లీటరుకు రూపాయి చొప్పున పెంపు..
- 2,00,000 లీటర్ల వరకు ఎత్తైన గృహ భవనాలకు లీటరుకు 0.30 పైసలు
- 2,00,001 నుంచి 5,00,000 లీటర్ల వరకు లీటరుకు 0.60 పైసలు
- 5,00,001 లీటర్లకు మించి ఉంటే లీటరుకు రూపాయి చొప్పున పెంచనున్నారు.