శివ – నటీనటులు.. అప్పుడు – ఇప్పుడు

రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా లోకంలో అడుగుపెట్టినప్పుడు, ఆయన తొలి చిత్రంతోనే.. సినిమా అంటే ఇలానే ఉండాలి అనే రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేశారు. తన స్టైల్ లో తీసిన ఆ సినిమా… తెలుగు సినీ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికింది. ఆ సినిమా పేరు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అదే.. శివ. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ క్లాసిక్ గా కాదు.. టైమ్ లెస్ క్లాసిక్ గా నిలవడం విశేషం.
అయితే.. ఆ టైమ్ లెస్ క్లాసిక్ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటీనటులు, అప్పట్లో ఎలా ఉన్నారో అందరికీ తెలిసిందే కానీ.. ఇప్పుడు వారు ఎలా ఉన్నారు.? ఏం చేస్తున్నారు..? ఆ చిత్రంలోని ప్రధాన తారాగణం అప్పట్లో ఎలా మెరిశారో, ఇప్పుడు ఎలా మారారో ఒకసారి చూద్దాం.
నాగార్జున – శివ సినిమాతో సంచలనం సృష్టించిన నాగార్జున ఇప్పుడు కెరీర్ లో 100వ సినిమా అనే మైలురాయికి చేరుకున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమల – నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత అమల నటనకు దూరమై బ్రూ క్రాస్ పేరుతో మూగజీవాలకు సేవ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మనం, ఒకే ఒక జీవితం చిత్రాల్లో నటించారు.

తనికెళ్ళ భరణి – శివ సినిమాలో నానాజీ పాత్రలో అదరగొట్టేశారు. అలాగే డైలాగులతో కూడా మెప్పించారు. ఓ వైపు నటుడుగా, మరో వైపు రచయితగా, దర్శకుడిగా ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో తన మార్క్ చూపించారు.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన ఆయన.. నాటి నుంచి నేటీకి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుండడం విశేషం.

బ్రహ్మాజీ – శివ సినిమాలో బ్రహ్మాజీ చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక అక్కడ నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. సింధూరం సినిమాలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ నేటికీ బిజీగా ఉన్నారు.

చక్రవర్తి – శివ సినిమాలో జెడీగా నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆతర్వాత హీరోగా టర్న్ అయి.. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు. గులాబీ సినిమాతో జేడీ హీరోగా యూత్ కి దగ్గరయ్యాడు. తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న జేడీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ, అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తున్నారు.

రామ్ జగన్ – రామ్ జగన్ శివ సినిమాలో నరేష్ పాత్రలో నటించాడు. శివ తర్వాత ఎన్నో సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించాడు. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన మహాత్మ సినిమాలో ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అంటూ సాగే పాటలో.. గాంధీ పాత్రలో నటించి మెప్పించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రామ్ జగన్. ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు.

శుభలేక సుధాకర్ – శివ సినిమాలో శుభలేక సుధాకర్ మల్లిక్ అనే పాత్రలో నటించారు. శివ సినిమా తర్వాత తెలుగు, తమిళ్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రస్తుతం సినిమాల్లోనూ, అలాగే సీరియల్స్ లోనూ నటిస్తున్నారు.

ఉత్తేజ్ – శివ సినిమాలో యాదగిరి పాత్రలో ఉత్తేజ్ తనదైన స్టైల్ లో నటించి నవ్వించారు. ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించిన ఉత్తేజ్.. ప్రస్తుతం యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ల కోసం మయుఖ టాకీస్ పేరుతో యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇస్తుండడం విశేషం.

