ప్రజా తీర్పు కూటమికే అనుకూలం

  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్డీయే కూటమిదే విజయం
  • పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్దా వెంకన్న
  • ‘ఇంటింటి తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన
  • చంద్రబాబు, మోదీ, పవన్, లోకేష్ నాయకత్వంపై ప్రజల్లో అపార విశ్వాసం

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజా తీర్పు కూటమికే అనుకూలంగా ఉందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీయే కూటమిదే విజయం అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్‌లో డివిజన్ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని, అదే రానున్న ఎన్నికల్లో స్పష్టమైన తీర్పుగా మారబోతోందని వ్యాఖ్యానించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు, అభద్రత, పరిపాలనా వైఫల్యాలను ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.

గతంలో భయాందోళనలతో గడిపిన ప్రజలు ఇప్పుడు గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘ఇంటింటి తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటికే సుమారు 50 శాతం కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తుండగా ప్రజలు స్వచ్ఛందంగా తమ మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో దీర్ఘకాలం కొనసాగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి నిరంతర కృషి చేస్తుందని బుద్దా వెంకన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడు మల్లెల ఈశ్వర్, క్లస్టర్ ఇన్‌చార్జి ఆలుగండ్ల సుబ్బారెడ్డి, రాష్ట్ర నగల కార్పొరేషన్ డైరెక్టర్ దవడ సాయి సుధాకర్, రెల్లి కార్పొరేషన్ సభ్యురాలు తుపాకుల రమణమ్మ, బూత్, యూనిట్ ఇన్‌చార్జిలు, టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.