ఉద్యోగుల బకాయిలపై ఇక కాలయాపన వద్దు..
- ‘రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగులకే’ అనడం సరికాదు..
- రెవెన్యూ వ్యయంలో ఉద్యోగులు, పెన్షనర్ల వాటా 37.41 శాతమే
- ఐఆర్ ప్రకటించాలి.. ఐదు డీఏలు విడుదల చేయాలి..
- పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలి
- ఆగస్టు 15 తర్వాత ఐక్య కార్యాచరణకు సిద్ధం
- ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
(విజయవాడ, ఆంధ్రప్రభ) ; ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇకనైనా చర్చల పేరుతో కాలయాపన చేసే విధానానికి స్వస్తి పలికి, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగులు కొత్త డిమాండ్లు ఏమీ కోరడం లేదని, కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఎంత బకాయి ఉంది, ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా ప్రకటించడంతో పాటు ఆ వివరాలన్నింటినీ ఉద్యోగుల పే స్లిప్‌లలో పొందుపరచాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించడం ప్రభుత్వ బాధ్యతేనని, ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం కాదా అని ప్రశ్నించింది. విజయవాడ రెవెన్యూ భవన్లో శనివారం ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించింది. అనంతరం రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా విభాగం చైర్పర్సన్ పి.లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రారంభించనున్న సమయంలో ప్రభుత్వం చర్చలకు పిలవడం సానుకూల పరిణామంగా భావించామని తెలిపారు. అయితే జూలై 22న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆవేదన, అసంతృప్తికి కారణమైందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వాన్ని కొత్తగా ఎలాంటి డిమాండ్లు అడగడం లేదని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఇవేమీ గొంతెమ్మ కోర్కెలు కావని స్పష్టం చేశారు.
ఆగస్టు 4న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఏపీ జేఏసీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తున్న ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నా వారిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో మెరుగైన పీఆర్సీ అమలు, అలవెన్సుల చెల్లింపు, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐఆర్ ప్రకటించడం, సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడం, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఈ అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.
ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపినా ఎలాంటి నిర్ణయాలు వెలువరించకుండా కాలయాపన చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగుల అంశాలపై సానుకూల నిర్ణయాలు వస్తాయని ఎదురుచూస్తున్న తరుణంలో రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగులకే వెళ్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.
ప్రభుత్వం శ్వేతపత్రంలో ఉద్యోగులపై పెడుతున్న ఖర్చును రాష్ట్రం మొత్తం ఖర్చులో ఎంత శాతమో వెల్లడించకుండా, ఆదాయమంతా ఉద్యోగులకే ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పడం సరికాదని బొప్పరాజు తెలిపారు. కాగ్ నివేదికల ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేసిన మొత్తం రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లిస్తున్న వ్యయం కేవలం 37.41 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు అయ్యే ఖర్చు 59.36 శాతం మాత్రమేనని, మొత్తం రెవెన్యూ ఆదాయంలో జీతాలు, పెన్షన్లకు అయ్యే వ్యయం 47.64 శాతం మాత్రమేనని తెలిపారు.
ఈ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన నివేదికల ఆధారంగానే చెబుతున్నామని అన్నారు. రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల నిష్పత్తిని ప్రభుత్వం చూపుతున్న విధానంలో వాస్తవ పరిస్థితికి భిన్నమైన గణాంకాలు ఉన్నాయని ఆరోపించారు. మూలధన వ్యయాన్ని మినహాయించి ప్రభుత్వం చేస్తున్న మొత్తం రెవెన్యూ వ్యయంలో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు సుమారు 38 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు కాగ్ వెబ్‌సైట్‌లోని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వం రూ.30 వేల కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు చెబుతున్న విషయాన్ని కూడా ఏపీ జేఏసీ నాయకులు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024 నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, ప్రభుత్వం చేసిన చెల్లింపుల్లో అధిక భాగం రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినవేనని, అవి కూడా ఉద్యోగులు సర్వీసులో ఉండగా తమ జీతాల నుంచి దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితర మొత్తాలేనని పేర్కొన్నారు. ఉద్యోగి దాచుకున్న డబ్బులను కనీసం పదవీ విరమణ అనంతరమైనా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
ఒకసారి జీతంతో పాటు చెల్లించినట్లు చూపిన మొత్తాలనే ఇప్పుడు చెల్లించినట్లుగా పేర్కొంటున్నారని విమర్శించారు. రెండేళ్లుగా రిటైర్ అయిన ఉద్యోగులకు కనీసం గ్రాట్యుటీ కూడా అందక ఇబ్బందులు పడుతున్నారని, ముందుగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి తరఫున ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కోరామని తెలిపారు. వాటిని మినహాయిస్తే సర్వీసులో ఉన్న ఒక్క ఉద్యోగికి కూడా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని, ఉద్యోగులు, పోలీసులకు సరెండర్ లీవుల బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఇప్పటికే పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రానున్న రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభుత్వానికి అయ్యే వ్యయం గణనీయంగా తగ్గనుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 2024లో 13,643 మంది, 2025లో 13,583 మంది, 2026లో 14,095 మంది చొప్పున ఇప్పటివరకు మొత్తం 41,321 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో కూడా ప్రతి ఏడాది సుమారు 14 నుంచి 15 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారని, 2035 నాటికి మొత్తం 1,51,755 మంది పదవీ విరమణ చేయనున్నారని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులపై ప్రభుత్వం చేస్తున్న జీతభత్యాల వ్యయంలో సగానికి పైగా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందన్నారు. అలాంటప్పుడు ఉద్యోగులపై మొత్తం ఆదాయమంతా ఖర్చవుతోందన్న ప్రచారం చేయడం సరికాదన్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు ప్రభుత్వం వెంటనే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిషనర్ నియామకాన్ని వెంటనే చేపట్టాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగులకు చెల్లించాల్సిన పాత బకాయిలు ఎంత, ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా లెక్కలు చెప్పాలని, ఆ వివరాలను ఉద్యోగుల పే స్లిప్‌లలో పొందుపరచాలని కోరింది.
సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని, పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లిన 29 అంశాల్లో ప్రధానమైన డిమాండ్లపై తక్షణమే నిర్ణయాలు ప్రకటించాలని కోరింది.
ఈ అంశాలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోతే ఇప్పటికే ప్రకటించిన కార్యాచరణ ప్రకారం ఆగస్టు 15 తర్వాత కలిసి వచ్చే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సంఘాలతో ఐక్య కార్యాచరణకు ఏపీ జేఏసీ అమరావతి ఉపక్రమిస్తుందని బొప్పరాజు హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టకుండా, చర్చల పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలపై సానుకూల నిర్ణయాలను తక్షణమే ప్రకటించాలని ఉద్యమ కమిటీ చైర్మన్ టీవీ ఫణి పేర్రాజు, మహిళా విభాగం చైర్పర్సన్ పి.లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి కోరారు. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా ఉద్యమానికి దారితీస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెవ్వూరి రవి, ఏపీ క్లాస్‌ఫోర్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిన రామకృష్ణ, బాపట్ల జిల్లా చైర్మన్ వి.సురేష్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ పి.లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సంపత్, గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు వి.అరలయ్య, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్, యూనిటీ టీమ్ రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
