పూర్వ విద్యార్థుల సేవాభావం అభినందనీయం..

  • సిద్ధార్థ మెడికల్ కాలేజీకి రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాల విరాళం
  • విద్యార్థులు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్వ విద్యార్థుల సహకారం
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

(విజయవాడ, ఆంధ్రప్రభ) : సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు తమ మాతృసంస్థపై ఉన్న మమకారంతో విద్యార్థులు, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించిన కార్యక్రమానికి శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, తాము విద్యనభ్యసించిన మాతృసంస్థకు పూర్వ విద్యార్థులు తిరిగి సేవలందించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా వైద్య పరికరాలను విరాళంగా అందించడం ద్వారా పూర్వ విద్యార్థులు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారని కొనియాడారు.

అత్యాధునిక పరికరాలు ఆసుపత్రిలో అందుబాటులోకి రావడం వల్ల వైద్య సేవలను మరింత ఆధునికీకరించడంతో పాటు, రోగులకు వేగవంతమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా రక్త మార్పిడి సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వల్ల రోగులకు సురక్షితమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు మొత్తం రూ.75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. వీటి ద్వారా ఆసుపత్రిలో వైద్య సేవల సామర్థ్యం మరింత పెరగడంతో పాటు, రోగులకు అవసరమైన సమయంలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.వై. రావులు మాట్లాడుతూ విరాళంగా అందించిన పరికరాల్లో ‘స్టెరైల్ కనెక్టింగ్ డివైజ్’ అత్యంత ప్రాధాన్యత కలిగినదని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అవసరమయ్యే కొద్దిపాటి రక్తాన్ని కూడా తక్కువ మోతాదులో, అత్యంత సురక్షితమైన పద్ధతిలో సరఫరా చేసేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరికరాలు చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ పరికరం అందుబాటులోకి రావడం వల్ల చిన్నారులతో పాటు అవసరమైన ఇతర రోగులకు కూడా రక్త మార్పిడి సేవలను మరింత సురక్షితంగా అందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఆధునిక జెల్ టెక్నాలజీ ఆధారిత పరికరాల వినియోగం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మంది రోగులకు రక్త సంబంధిత సేవలు అందించేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. రక్త అనుకూలత పరీక్షలు, రక్త మార్పిడి ప్రక్రియలో ఈ సాంకేతికత కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గత ఆరు నెలల కాలంలో సుమారు 6 వేల మంది రోగులకు రక్తం సరఫరా చేసినట్లు తెలిపారు.

ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో మరింత వేగంగా, సురక్షితంగా రక్త మార్పిడి సేవలను అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పరికరాలు ఆసుపత్రిలోని వైద్య సేవల నాణ్యతను మరింత పెంచేందుకు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులకు ఆధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.వై.రావు, పూర్వ విద్యార్థుల సంఘం సెక్రటరీ డాక్టర్ అమన్న, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రంజిత తదితరులు పాల్గొన్నారు.