బోండా ఉమా వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్
- ముదురుతున్న వివాదం..
- మాజీ మంత్రికి ఎమ్మెల్యే బోండా ఉమా లీగల్ నోటీసులు
- అసత్య ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి..
- లేక రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి
- స్పందించకపోతే క్రిమినల్, సివిల్ కేసులు వేస్తాం
- విప్ బోండా ఉమా
( పాయికాపురం, ఆంధ్రప్రభ ) : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై బోండా ఉమా న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి వెల్లంపల్లి కి లీగల్ నోటీసులు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పంపించారు. గవర్నర్‌పేట లెనిన్ సెంటర్లోని వస్త్ర దుకాణాల యాజమానుల నుంచి బోండా ఉమా డబ్బులు వసూలు చేశారంటూ ఇటీవల వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
అసత్య ఆరోపణలు..

తనపై వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవని పేర్కొన్న బోండా ఉమా, వాటిపై వెల్లంపల్లి శ్రీనివాస్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో తన పరువు, ప్రతిష్ఠకు నష్టం కలిగించారని పేర్కొంటూ, క్షమాపణ చెప్పకపోతే రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులో కోరినట్లు తెలిపారు.
తన నోటీసుకు నిర్ణీత సమయంలో స్పందించకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్‌పై క్రిమినల్, సివిల్ కేసులు దాఖలు చేస్తామని బోండా ఉమా తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. దీంతో బోండా ఉమా,వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ విమర్శలు ఇప్పుడు న్యాయపరమైన వివాదంగా మారే పరిస్థితి నెలకొంది. ఆరోపణలకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలాంటి సమాధానం ఇస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
