బోన‌మెత్తిన చిన్నారులు

సంకల్ప్‌ ప్రైమ్‌ స్కూల్‌లో బోనాల ఉత్సవాలు

భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని సంకల్ప్‌ ప్రైమ్‌ స్కూల్‌లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బోనాలు ఎత్తుకుని పోతురాజు విన్యాసాలతో సందడి చేశారు. మహంకాళి అమ్మవారి పాటలు, డప్పు వాయిద్యాల నడుమ వేపకొమ్మలు చేతబూని విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్‌ ఎం.ఎస్‌. మూర్తి, డైరెక్టర్‌ శివనారాయణ, సీనియర్‌ అధ్యాపకులు సంజీవరావు జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోనాల పండుగ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సంతోష, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.